క్రికెట్ రికార్డ్: క్రికెట్ ప్రపంచంలో అప్పుడప్పుడు నమ్మశక్యం కాని రికార్డులు నమోదవుతుంటాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక జట్టు 50 ఓవర్లలో 500కు పైగా పరుగులు చేయడం లేదా ఒక బ్యాటర్ అత్యంత వేగంగా సెంచరీ చేయడం మనం చూస్తుంటాం. కానీ, ఇప్పుడు ఒక బౌలర్ అసాధారణమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. భూటాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనమ్ యేశే (Sonam Yeshey), టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించాడు. ఒకే టీ20 మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించాడు.
మయన్మార్ జట్టుపై భూటాన్ బౌలర్ పంజా
22 ఏళ్ల యేశే, శుక్రవారం గెలిఫులో మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డును నెలకొల్పాడు. తన కోటాలోని 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. భూటాన్ నిర్ణీత ఓవర్లలో 127/9 పరుగులు చేయగా, యేశే ధాటికి మయన్మార్ జట్టు కేవలం 45 పరుగులకే కుప్పకూలింది. మయన్మార్ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో యేశే మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనే మొత్తం 12 వికెట్లు తీసి టాప్ ఫామ్‌లో ఉన్నాడు.
గతంలో 7 వికెట్లు తీసిన బౌలర్లు
యేశే ఈ ఘనత సాధించకముందు, పురుషుల అంతర్జాతీయ టీ20లలో కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే 7 వికెట్లు తీశారు:
- శ్యాజ్రుల్ ఇద్రస్: 2023లో చైనాపై మలేషియా తరపున 8 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.
- అలీ దావూద్: 2025లో భూటాన్‌పై బహ్రెయిన్ తరపున 19 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ మ్యాచ్‌లు కాకుండా లీగ్ క్రికెట్లో కూడా ఇద్దరు మాత్రమే 7 వికెట్లు తీశారు:
- కోలిన్ అకర్మాన్: 2019లో లీసెస్టర్‌షైర్ తరపున 18 పరుగులకు 7 వికెట్లు.
- తస్కిన్ అహ్మద్: 2025లో ఢాకా క్యాపిటల్స్ తరపున 19 పరుగులకు 7 వికెట్లు.
మహిళల టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ రికార్డు
మహిళల టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 7/0. ఇండోనేషియాకు చెందిన రోహ్మాలియా 2024లో మంగోలియాపై ఈ అద్భుత రికార్డును సృష్టించింది. ఆమెతో పాటు నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడరిక్ ఓవర్డిజ్క్ (7/3), అర్జెంటీనాకు చెందిన అలిసన్ స్టాక్స్ (7/3) మరియు సైప్రస్‌కు చెందిన సామంతి (7/15) కూడా ఏడు వికెట్ల క్లబ్లో ఉన్నారు.
