తమిళనాడులోని సేలం జిల్లాలో మనసు కలిచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియురాలిని హత్య చేసి, ఆపై ఆమె భర్తకు ఆమె తాళిబొట్టును పార్శిల్ పంపి తన నేరాన్ని తానే బయటపెట్టుకున్నాడో వ్యక్తి.
అసలేం జరిగిందంటే? సేలం జిల్లా మారమంగళం గ్రామానికి చెందిన షణ్ముగం (32), నామక్కల్ జిల్లాకు చెందిన సుమతి (30) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ఇటీవల సుమతి హఠాత్తుగా అదృశ్యం కావడంతో షణ్ముగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భర్తకు వచ్చిన షాకింగ్ పార్శిల్: సుమతి అదృశ్యమైన రోజే సాయంత్రం, షణ్ముగం ఇంటి సమీపంలోని ఒక దుకాణంలో ఒక పార్శిల్ ఇచ్చారు. వెంకటేష్ అనే వ్యక్తి దీనిని పంపాడని షణ్ముగానికి సమాచారం అందింది. షణ్ముగం ఆ పార్శిల్ తెరిచి చూడగా, అందులో తన భార్య సుమతి తాళిబొట్టు ఉండటం చూసి హతాశుడయ్యాడు. దీంతో సుమతి అదృశ్యం వెనుక వెంకటేష్ హస్తం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు: పోలీసులు వెంకటేష్ (22)ను అదుపులోకి తీసుకుని విచారించగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమతికి, అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్‌కు ఏడాది కాలంగా వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ తరచుగా ఏకాంతంగా గడిపేవారు. డిసెంబర్ 23న కూడా వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో సుమతి ఫోన్‌కు ఒక కొత్త నంబర్ నుండి కాల్ వచ్చింది.
దీని గురించి వెంకటేష్ ప్రశ్నించగా సుమతి సరిగ్గా సమాధానం చెప్పలేదు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేష్, సుమతి మెడలోని దుపట్టాతో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ఒక మూటలో కట్టి, ఏకాడ్ – కుప్పనూర్ రోడ్డులోని మునియప్పన్ కోవెల సమీపంలో ఉన్న 600 అడుగుల లోతైన లోయలో పడేశాడు.
కుళ్ళిన స్థితిలో మృతదేహం: వెంకటేష్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు లోయలో గాలింపు చేపట్టారు. సుమారు 3 గంటల పోరాటం తర్వాత సుమతి మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు వెంకటేష్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
