ఘాట్‌లో ఫోన్ చోరీ.. దొంగ ఇంటికే వెళ్లిన యువతి: “నా మొబైల్ ఇక్కడే ఉంది” అంటూ షాక్!

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరం ప్రస్తుతం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ, రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంకిత గుప్తా కూడా ఇలాగే తన ఖరీదైన ఫోన్‌ను పోగొట్టుకుంది. అయితే, పోలీసులు ఆశించిన స్థాయిలో స్పందించకపోవడంతో, ఆమె తన సాంకేతిక పరిజ్ఞానంతో స్వయంగా దొంగను పట్టుకుంది.

అస్సీ ఘాట్‌లో ఐఫోన్ అపహరణ:
ముంబైలోని ఘాట్‌కోపర్‌కు చెందిన అంకిత గుప్తా వారణాసి పర్యటనకు వచ్చింది. సోమవారం సాయంత్రం అస్సీ ఘాట్ వద్ద ఆమె పర్యటిస్తుండగా, ఒక దొంగ ఆమె చేతిలోని రూ. 2 లక్షల విలువైన ఐఫోన్‌ను లాక్కొని పరారయ్యాడు. వేలమంది జనం, పోలీసులు ఉన్నప్పటికీ నిందితుడు తప్పించుకున్నాడు. అంకిత వెంటనే భేలూపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

టెక్నాలజీతో దొంగ వేట:
పోలీసులు లోకేషన్ ట్రాక్ చేయడంలో జాప్యం చేయడంతో, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన అంకిత స్వయంగా రంగంలోకి దిగింది. తన మొబైల్ IMEI నంబర్ మరియు ప్రత్యేక యాప్ సాయంతో ఫోన్ లోకేషన్‌ను ట్రాక్ చేయడం ప్రారంభించింది. రాత్రి 2 గంటల సమయంలో, అస్సీ ఘాట్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్‌పూర్ ప్రాంతంలో ఫోన్ ఉన్నట్లు లోకేషన్ చూపించింది.

దొంగ గదిలో ఖరీదైన ఫోన్ల గుట్ట:
అంకిత ఒంటరిగానే ఆ లోకేషన్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక ఇంటి గదిలో ఫోన్ ఉన్నట్లు ఖచ్చితంగా తేలడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. మొదట పోలీసులు పట్టించుకోకపోయినా, ఆమె పట్టుబట్టడంతో మరుసటి రోజు ఉదయం 5 గంటలకు గది తలుపులు తెరిపించారు. రాజేంద్ర పటేల్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్న ఆ గదిలో అంకిత ఐఫోన్‌తో పాటు మరో 15-20 ఖరీదైన మొబైల్ ఫోన్లు దొరకడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


Posted

in

by

Tags: