మొన్న ఓటీటీలో ‘విక్కీ డోనర్’ సినిమా చూశాను. ఖాళీగా తిరుగుతున్న ఒక యువకుడు డబ్బు కోసం వీర్యదానానికి (Sperm Donation) సిద్ధపడటం, ఆ తర్వాత అతని జీవితంలో జరిగే పరిణామాల ఆధారంగా ఆ సినిమా రూపొందింది. ఒక గంభీరమైన విషయాన్ని హాస్యంతో మేళవించి వినోదాత్మకంగా ప్రెజెంట్ చేసిన ఆ సినిమా నాకు చాలా నచ్చింది.
ఈ సినిమా విడుదలైనప్పుడు, దానిలోని బోల్డ్ మరియు అరుదైన కథాంశం అందరినీ ఆకర్షించింది. సినిమా వచ్చి పన్నెండేళ్లు గడిచాయి. ఈ కాలంలో మన దేశంలో ఐవీఎఫ్ (IVF) ద్వారా ఎందరో దంపతుల కలలు నిజమయ్యాయి. కానీ, భారతదేశం లాంటి సాంప్రదాయ దేశాల్లో వీర్యదానం అనేది ఇప్పటికీ బహిరంగంగా చర్చించని అంశం. సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ, ఈ విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే తరుణంలో, వీర్యదానం కారణంగా జరిగిన ఒక అరుదైన సంఘటనపై గత వారం బిబిసి (BBC) ప్రచురించిన నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
డెన్మార్క్ డోనర్ కథ: ఒక భయంకర నిజం
డెన్మార్క్‌కు చెందిన ఒక వ్యక్తి అక్కడి ‘యూరోపియన్ స్పర్మ్ బ్యాంక్’లో రిజిస్టర్డ్ డోనర్. అన్ని భద్రతా ప్రమాణాలు, వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే అతని వీర్యాన్ని సేకరించారు. అయితే, ఆ వ్యక్తి వీర్యాన్ని ఉపయోగించిన 197 మంది పిల్లలపై ఇప్పుడు క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని దర్యాప్తులో తేలింది. ఇంతమంది పిల్లలకు క్యాన్సర్ ముప్పును కలిగించిన ఆ దాతకు మాత్రం క్యాన్సర్ లేదు.. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం.
సాధారణంగా ఒక వ్యక్తి వీర్యదానానికి అర్హత పొందాలంటే అనేక నిబంధనలు ఉంటాయి:
- వయస్సు: సాధారణంగా 21 నుండి 35 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత ఇస్తారు (కొన్నిసార్లు 55 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది).
- ఆరోగ్య చరిత్ర: కుటుంబంలో ఎలాంటి అంటువ్యాధులు లేదా అనువంశిక (Genetic) రోగాల చరిత్ర ఉండకూడదు.
- వ్యసనాలు: ధూమపానం, మాదకద్రవ్యాల అలవాటు ఉండకూడదు.
- వైద్య పరీక్షలు: ల్యాబ్‌లో వీర్యకణాల సంఖ్య, ఆకారం మరియు వాటి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి 100 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే అన్ని పరీక్షల్లో పాసై వీర్యదాతలుగా ఎంపికవుతారు.
అసలు ఏం జరిగింది? (Li-Fraumeni Syndrome)
బిబిసితో సహా 14 వార్తా సంస్థలు జరిపిన విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ దాత 2005 నుండి తన విద్యార్థి దశలో ఖర్చుల కోసం వీర్యదానం చేయడం ప్రారంభించాడు. బ్యాంక్ నిర్వహించిన అన్ని పరీక్షల్లో అతను పాస్ అయ్యాడు, అప్పుడు అతనికి క్యాన్సర్ లక్షణాలు ఏవీ లేవు.
కానీ, దర్యాప్తులో తేలింది ఏంటంటే.. ఆ దాత పుట్టకముందే, అంటే అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతనిలోని కొన్ని కణాల్లో డీఎన్ఏ (DNA) పరివర్తన (Mutation) జరిగింది. దీనివల్ల అతనిలోని ‘TP53’ అనే జన్యువు దెబ్బతింది. మానవ శరీరంలో క్యాన్సర్ వ్యాపించకుండా అడ్డుకోవడంలో ఈ TP53 జన్యువు కీలక పాత్ర పోషిస్తుంది. దాత శరీరంలో ఈ జన్యులోపం అతనికి క్యాన్సర్ కలిగించే స్థాయిలో లేదు కాబట్టి అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ, కృత్రిమ గర్భధారణ ద్వారా అతని వీర్యం నుండి పుట్టిన పిల్లలకు ఈ దెబ్బతిన్న జన్యువు సంక్రమించింది. దీనినే ‘లి-ఫ్రామెనీ సిండ్రోమ్’ (Li-Fraumeni Syndrome) అంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలకు జీవితకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్, ఎముకల క్యాన్సర్ లేదా ల్యుకేమియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం 99% కంటే ఎక్కువగా ఉంటుంది.
వ్యాపారంగా మారిన వైద్యం
ఈ ఒక్క డోనర్ వీర్యాన్ని 14 దేశాల్లోని 67 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో ఉపయోగించారు. అంతర్జాతీయ స్థాయిలో ఒకే వ్యక్తి వీర్యాన్ని ఎన్నిసార్లు ఉపయోగించాలనే దానిపై స్పష్టమైన చట్టాలు లేవు. ఒక్కో దేశం ఒక్కోలా వ్యవహరిస్తోంది (బెల్జియంలో 6 కుటుంబాల పరిమితి ఉంటే, భారత్ మరియు అమెరికాలో 10 కుటుంబాల వరకు ఉంటుంది). కానీ బెల్జియంలో నిబంధనలను ఉల్లంఘించి 38 మంది మహిళలకు ఈ వ్యక్తి వీర్యాన్ని వాడారు.
పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా డెన్మార్క్‌లో వీర్యదానం అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారింది. 2033 నాటికి ఈ వ్యాపారం 8 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. డెన్మార్క్ యువకుల ఆకర్షణీయమైన రూపం (నీలి కళ్ళు, పొడవైన శరీరం) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘వైకింగ్ స్పర్మ్’కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి నిబంధనలను గాలికొదిలేసి, ఒకే డోనర్ వీర్యాన్ని వందలాది మందికి పంపిణీ చేయడం వల్లే ఈ విపత్తు సంభవించింది.
వైద్యరంగం నైతికతను విస్మరించి లాభాల వేటలో పడితే, ఇలాంటి దారుణమైన ఫలితాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది.
