బురఖా ధరించిన ఒక మహిళా ఉపాధ్యాయురాలిని మద్రాసా సూపరింటెండెంట్ ఎత్తుకుని ఆమె ముఖంపై ఉన్న ముసుగును తొలగించి ముద్దులాడటం మొదలుపెట్టాడు. ఆ ఉపాధ్యాయురాలు కూడా నవ్వుతూ ఆయన చేష్టలను ఆస్వాదిస్తోంది. ఈ శృంగారభరితమైన దృశ్యాన్ని పక్క భవనంపై ఉన్న ఒక విద్యార్థి చూశాడు.
పరధ్యానంలో ఉన్న సదరు టీచర్ మరియు సూపరింటెండెంట్ ఆ విద్యార్థిని గమనించలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న విద్యార్థి తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. తమ గుట్టు బయటపెట్టినందుకు కోపంతో ఊగిపోయిన సూపరింటెండెంట్ ఆ విద్యార్థిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని కుమిల్లా జిల్లా నాంగల్కోట్ తాలూకాలో గల ‘బంగ్డ్డా దారుల్ ఫలాహ్ హమీదియా మద్రాసా’లో జరిగింది. గాయపడిన విద్యార్థి ఫైసల్ మహమూద్ (14) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అసలేం జరిగింది?
వివరాల ప్రకారం.. ఫైసల్ ఎనిమిదో తరగతి విద్యార్థి. సెప్టెంబర్ 12 రాత్రి మద్రాసా భవనంపై ఉన్న ఫైసల్, కిటికీలో నుండి పక్కనే ఉన్న ఆఫీసు గదిలో సూపరింటెండెంట్ నిజాం ఉద్దీన్ హమీది ఒక మహిళా టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించడం చూశాడు. దానిని వీడియో తీసి మరుసటి రోజు తన స్నేహితులకు చూపించాడు. విషయం తెలిసిన నిజాం ఉద్దీన్, దీనిని రహస్యంగా ఉంచమని ఫైసల్‌ను హెచ్చరించాడు. కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నిజాం ఉద్దీన్ కోపం పెంచుకున్నాడు.
మంగళవారం ఫైసల్ అనారోగ్యం కారణంగా క్లాసులకు వెళ్లకుండా పడుకున్నాడు. పాత కక్షను మనసులో పెట్టుకున్న నిజాం ఉద్దీన్, క్లాసులకు ఎందుకు రాలేదని నెపంతో ఫైసల్‌ను కర్రతో విచక్షణారహితంగా బాదాడు. విషయం తెలుసుకున్న ఫైసల్ తల్లి మద్రాసాకు చేరుకుని తన కుమారుడిని రక్షించి ఆసుపత్రిలో చేర్పించింది. నాలుగు రోజుల చికిత్స తర్వాత కూడా బాలుడి శరీరంపై దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బాధితుడి తల్లి మరియు స్థానికుల ఆవేదన
ఫైసల్ తల్లి హలీమా బేగం మాట్లాడుతూ.. “సూపర్ నిజాం చేస్తున్న తప్పుడు పనుల గురించి నా కొడుకు నాకు చెప్పాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని నేను వాడిని హెచ్చరించాను, కానీ వయస్సు చిన్నది కావడంతో వాడు అందరికీ చెప్పేసి వీడియో పోస్ట్ చేశాడు. అందుకు నా బిడ్డను ఇంత దారుణంగా కొడతారా? నాకు న్యాయం కావాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు సైతం నిజాం ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను ఇలాంటి పనులకు అలవాటు పడ్డాడని, స్థానికుడు కావడంతో ఎవరూ ఎదురుతిరగడం లేదని వారు చెబుతున్నారు.
నిందితుడి వివరణ
నిందితుడు షా మహమ్మద్ నిజాం ఉద్దీన్ హమీది మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. “ఫైసల్ సెలవు తీసుకోకుండా క్లాసులకు రాలేదు. అడిగితే నాపైనే గట్టిగా అరిచాడు, అందుకే బెత్తంతో కొట్టాను. అంతే తప్ప వీడియో వ్యవహారం నిజం కాదు. కుటుంబ సభ్యులకు క్షమాపణలు కూడా చెప్పాను” అని చెప్పుకొచ్చాడు.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ.. దీనిపై ఫిర్యాదు అందితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఘటన జరిగి నెలలు గడుస్తున్నా సదరు సూపరింటెండెంట్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
