కాఠ్మండు: భారత సరిహద్దులో ఉన్న నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో భారీగా భద్రతా దళాలను మోహరించినట్లు సమాచారం. మతపరమైన అంశాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత నేపాల్‌లోని పర్సా జిల్లా బీర్గంజ్ పట్టణంలో నిరసనలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.
పర్సా జిల్లా యంత్రాంగం బీహార్‌లోని రక్సాల్ జిల్లాకు ఆనుకుని ఉన్న బీర్గంజ్ నగరంలో కర్ఫ్యూ విధించింది. నేపాల్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో భారత సరిహద్దు గుండా జరిగే అన్ని రకాల రాకపోకలను, రవాణాను నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అల్లర్లకు కారణం ఏమిటి? ధనుషా జిల్లా కమల మున్సిపాలిటీకి చెందిన హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే ఇద్దరు ముస్లిం యువకులు సోషల్ మీడియాలో హిందూ సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వీడియో మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఉందని ఆరోపిస్తూ స్థానికులు ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఉద్రిక్తతల మధ్యే కమల ప్రాంతంలోని సఖువా మారన్‌లో ఒక మసీదును ధ్వంసం చేసిన సంఘటన పెద్ద అల్లర్లకు దారితీసినట్లు నేపాల్ మీడియా నివేదించింది. వైరల్ వీడియోకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన హిందూ సంఘాలు పోలీసులపై రాళ్లు రువ్వి, స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి చేశాయి. నిరసనకారులను నియంత్రించడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి, గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బీర్గంజ్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు నేపాల్ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు.
