చెయ్యి విరగ్గొట్టి, కంటిపై చాకుతో దాడి చేసిన భార్య: పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసిన రౌడీషీటర్!

బెంగళూరు : సాధారణంగా రౌడీషీటర్లు పోలీసులకు గానీ, చట్టానికి గానీ భయపడకుండా రెచ్చిపోవడం మనం చూస్తుంటాం. జైలుకు వెళ్లి వచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రాదు. కానీ, సయ్యద్ అస్గర్ అనే రౌడీషీటర్ మాత్రం తన భార్య దెబ్బకు భయపడి స్వయంగా పోలీసుల వద్దకు పరుగులు తీశాడు.

అసలేం జరిగింది? గంజాయి విక్రయాలు, దొంగతనాలు, హత్యాయత్నం వంటి అనేక తీవ్రమైన కేసులు సయ్యద్ అస్గర్‌పై ఉన్నాయి. పోలీసులకు కూడా చిక్కకుండా తప్పించుకు తిరిగే ఇతను, ఇటీవల జైలు నుండి విడుదలయ్యాడు. అయితే, ఈసారి అతను పోలీస్ స్టేషన్‌కు వచ్చింది నిందితుడిగా కాదు, బాధితుడిగా!

సయ్యద్ అస్గర్‌కు ఇద్దరు భార్యలు. రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య అతడితో గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ అస్గర్ చెయ్యి విరగ్గొట్టడమే కాకుండా, చాకుతో అతని కంటిపై దాడి చేసింది. భార్య దాడి నుండి తృటిలో తప్పించుకున్న అస్గర్, తన రెండో భార్యతో కలిసి జేజే నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మొదటి భార్యపై ఫిర్యాదు చేశాడు.

ముందే హెచ్చరించిన భార్య: అస్గర్ మొదటి భార్య ఇదివరకే ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో వేటకొడవలి (మచ్చా) పట్టుకుని “నీ తల నరుకుతాను, రెండు రోజులు వేచి ఉండు” అని అతడిని బహిరంగంగా హెచ్చరించింది. ఆ హెచ్చరిక చేసిన కొద్దిరోజుల్లోనే ఆమె ఈ దాడికి పాల్పడింది. ఊరందరినీ భయపెట్టే రౌడీషీటర్, తన భార్య చేతిలో దెబ్బలు తిని పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు బెంగళూరులో చర్చనీయాంశమైంది. అస్గర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: