2026లో పిఎఫ్ డబ్బు ఉపసంహరణకు సంబంధించిన కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయి? ఎవరు ఎంత డబ్బు తీసుకోవచ్చు? పాత నిబంధనలతో పోలిస్తే ఇప్పుడు ఎంత సులభంగా మారింది? అనేది ప్రతి ఉద్యోగి తెలుసుకోవాలి. గతంలో అనారోగ్య కారణాల కోసం 50 శాతం మాత్రమే తీసుకునే వీలుండగా, ఇప్పుడు 100 శాతం వరకు అనుమతిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ఒక ఉద్యోగి 12 నెలల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత, నిర్దిష్ట అవసరాల కోసం తన PF బ్యాలెన్స్‌లో 100% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
కేటగిరీ 1 – ప్రాథమిక సామాజిక అవసరాలు:
- వైద్య చికిత్స (Illness): మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలిగితే, ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) గరిష్టంగా 3 సార్లు 100% వరకు డబ్బు తీసుకోవచ్చు.
- విద్య (Education): ఉన్నత చదువుల కోసం మొత్తం కెరీర్లో గరిష్టంగా 10 సార్లు డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉంది. ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసిన వారు రిటైర్మెంట్ లోపు 10 సార్లు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు.
- వివాహం: మీ పెళ్లి లేదా కుటుంబ సభ్యుల వివాహ ఖర్చుల కోసం మొత్తం సర్వీస్‌లో గరిష్టంగా 5 సార్లు తీసుకోవచ్చు. ఇది కూడా 12 నెలల సర్వీస్ తర్వాతే సాధ్యం.
కేటగిరీ 2 – ఇల్లు మరియు ఆస్తి:
- ఇల్లు కొనడం / కట్టడం / అప్పు తీర్చడం / రిపేర్లు: సొంత ఇంటికి సంబంధించిన ఏ అవసరానికైనా మీ మొత్తం కెరీర్లో గరిష్టంగా 5 సార్లు PF డబ్బు తీసుకోవచ్చు.
కేటగిరీ 3 – ప్రత్యేక పరిస్థితులు (Special Circumstances):
- కారణం లేకుండా (Emergency): మీకు అత్యవసరంగా డబ్బు అవసరమై, నిర్దిష్ట కారణం చెప్పకూడదు అనుకుంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2 సార్లు ఇలా డబ్బు తీసుకోవచ్చు.
ముఖ్య గమనిక: ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ, PF డబ్బును పదేపదే తీయవద్దు. అత్యవసర వైద్యం లేదా ఇల్లు కట్టుకోవడం వంటి పెద్ద పనులకు తప్ప మిగిలిన వాటికి వాడకపోవడమే మంచిది. మీరు 58 ఏళ్ల వరకు డబ్బు తీయకుండా ఉంటే, చక్రవడ్డీతో కలిపి రిటైర్మెంట్ సమయానికి భారీ మొత్తంలో నగదు లభిస్తుంది.
