కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంపై ఈడీ దాడులు జరిగాయి. ఈ సోదాల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఏం జరిగింది?
ఉదయం 11:30 గంటలకు ఐ-ప్యాక్ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు ప్రారంభించగానే, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ అక్కడికి చేరుకున్నారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అక్కడికి వెళ్లారు. సోదాలు జరుగుతుండగానే ఆమె లోపలికి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత చేతిలో ఒక పచ్చని ఫైలుతో బయటకు వచ్చారు.
మమతా బెనర్జీ ఆరోపణలు:
బయటకు వచ్చిన మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా తన పార్టీ వ్యూహాలు, అభ్యర్థుల జాబితా మరియు భవిష్యత్తు ప్రణాళికలు ఉన్న హార్డ్ డిస్క్‌లను దొంగిలించడానికే ఈ దాడులు చేయించారని ఆమె ఆరోపించారు. అక్కడి నుండి ఆమె నేరుగా సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ మెయిన్ ఆఫీస్‌కు బయలుదేరారు.
కారులో ఫైళ్ల తరలింపు – ఆసక్తికర దృశ్యం:
సాల్ట్ లేక్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఒక తెల్లటి SUV కారు ఆఫీస్ బేస్మెంట్లోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు కార్యాలయం నుండి గుట్టలుగా ఫైళ్లను తీసుకొచ్చి ఆ కారులో వేగంగా నింపడం మొదలుపెట్టారు. వారు పోలీసులు లేదా ఐ-ప్యాక్ ఉద్యోగులు అన్నది స్పష్టత లేదు.
అయితే, ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్న ఐదు నిమిషాల తర్వాత, ఫైళ్లను కారులోకి ఎక్కిస్తున్న సమయంలో ఒక వ్యక్తి చేతిలో నుండి ఫైల్ జారి కిందపడింది. ఆ ఫైల్ కవరు తెరుచుకోగా, అందులో “గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్” (Government of West Bengal) అని రాసి ఉన్న ఒక జిరాక్స్ కాగితం మీడియా కంట పడింది. వెంటనే దానిని ఎవరూ చూడకుండా గబగబా కారులోకి ఎక్కించేశారు.
అసలు కారణం ఏమిటి?
బొగ్గు అక్రమ రవాణా (Coal Smuggling) కు సంబంధించిన కీలక పత్రాలను సేకరించేందుకే ఈడీ ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్ర బలగాలకు మరియు స్థానిక పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది.
