గ్రీన్లాండ్: బంగారం కంటే విలువైన ప్రపంచ నిధి! ఈ దీవి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు ఆరాటపడుతున్నారు?

గ్రీన్లాండ్ అంటే కేవలం మంచు గడ్డ కాదు, అది బంగారం కంటే విలువైన అపారమైన సంపదకు నిలయం. విస్తీర్ణంలో ఇది భారతదేశంలో మూడింట రెండు వంతుల పరిమాణంలో ఉంటుంది (దాదాపు 16 తమిళనాడు రాష్ట్రాలు ఇందులో ఇమిడిపోతాయి). కానీ ఇక్కడి జనాభా కేవలం 57,000 మాత్రమే.

ట్రంప్ ఎందుకు కొనాలనుకుంటున్నారు?

వెనిజులాలో తన అధికారాన్ని చాటుకున్న అమెరికా, ఇప్పుడు తన చూపును డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్‌పై సారించింది. ఈ దీవిని డెన్మార్క్ నుండి కొనుగోలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి:

  1. దాగి ఉన్న నిధులు: గ్రీన్లాండ్‌లో 80% భూభాగం మంచుతో నిండి ఉంటుంది. ఈ మంచు కింద బంగారం, వజ్రాలు మరియు నేటి ప్రపంచానికి అత్యంత అవసరమైన “Rare Earth” (అరుదైన ఖనిజాలు) భారీగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, విండ్ టర్బైన్ల తయారీకి ఇవి చాలా కీలకం. ప్రస్తుతం వీటిపై చైనాకు ఉన్న గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయడం అమెరికా లక్ష్యం.
  2. ప్రయాణ మార్గం: వాతావరణ మార్పుల వల్ల మంచు కరుగుతుండటంతో, గ్రీన్లాండ్ మీదుగా ఓడల రాకపోకలు సులభతరం అవుతున్నాయి. దీనివల్ల ఆసియా నుండి యూరప్‌కు వెళ్లే దూరం తగ్గి, సూయజ్ కాలువతో అవసరం లేకుండా పోతుంది.
  3. సైనిక వ్యూహం: ఉత్తర అమెరికాను రక్షించుకోవడానికి గ్రీన్లాండ్ అత్యంత కీలకమైన ప్రాంతం. ఇక్కడ అమెరికాకు చెందిన ‘పిటుఫిక్ స్పేస్ బేస్’ ఇప్పటికే ఉంది. రష్యా లేదా చైనా నుండి వచ్చే క్షిపణులను ముందుగానే గుర్తించడానికి ఈ ప్రాంతం కీలకం.
రాజకీయ వ్యూహాలు – ‘ల్యాండ్ గ్రాబింగ్’ మోడల్:

మన దగ్గర పెద్ద రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఎక్కడ ధరలు పెరుగుతాయో తెలుసుకుని, ముందుగానే భూములను తక్కువ ధరకు ఎలా కొంటారో.. అమెరికా కూడా గ్రీన్లాండ్ భవిష్యత్తు విలువను గుర్తించి ఇప్పుడే దానిపై పట్టు సాధించాలని చూస్తోంది.

ప్రస్తుత పరిస్థితి:
  • డెన్మార్క్ నిరాకరణ: గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్ ప్రధాని స్పష్టం చేశారు. అయితే అమెరికా అక్కడ కొత్త రాయబార కార్యాలయాన్ని తెరిచి, మైనింగ్ మరియు టూరిజం కోసం భారీగా నిధులు ఇస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
  • చైనా & రష్యా కన్ను: చైనా ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ చైనా ఇక్కడ పాగా వేస్తే, అది అమెరికా పెరట్లో శత్రువు కూర్చున్నట్లే అవుతుంది. ఇది అమెరికాకు పెద్ద ముప్పు.
  • స్థానికుల అభిప్రాయం: గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్ లేదా అమెరికా.. ఎవరి నియంత్రణలోనూ ఉండటానికి ఇష్టపడటం లేదు. వారు ‘స్వతంత్ర దేశం’గా మారాలని కోరుకుంటున్నారు.

Posted

in

by

Tags: