స్కూల్ బ్యాగుల బరువు చిన్న పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కారవార్కు చెందిన సమర్థ్ నాయక్ అనే విద్యార్థి ఈ ప్రమాదానికి గురయ్యాడు.
ఏం జరిగింది?
సమర్థ్ నాయక్ కారవార్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కువ పుస్తకాలు తీసుకురావాలని చెప్పడంతో, ఆ అబ్బాయి తన బ్యాగ్లో భారీ సంఖ్యలో పుస్తకాలను నింపుకుని స్కూలుకు వెళ్లాడు. రోజంతా ఆ బరువును మోసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, అతని కుడి భుజం భాగంలో తీవ్రమైన వాపు కనిపించింది.
వైద్యుల నిర్ధారణ:
పిల్లాడి పరిస్థితి చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే కారవార్లోని ‘క్రిమ్స్’ (KRIMS) ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఎక్స్-రే తీయగా.. భారీ బరువు వల్ల ఆ బాలుడి కుడి చేయి ఎముక విరిగినట్లు (Fracture) నిర్ధారణ అయ్యింది. ఒక చిన్నారి కేవలం పుస్తకాల సంచి బరువుకే చేయి విరగ్గొట్టుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
