ఆస్కార్ 2026 – 4 భారతీయ చిత్రాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి

ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగానికి ఇచ్చే అత్యున్నత గౌరవంగా ఆస్కార్ అవార్డును పరిగణిస్తారు. 2026 ఆస్కార్ అవార్డులకు సంబంధించి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరీలో పోటీ పడే చిత్రాల ప్రాథమిక జాబితాలో (Reminders List) భారతదేశం నుండి 4 సినిమాలు ఎంపికయ్యాయి. ఈ వార్త భారతీయ సినిమా అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.

చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చి 15న జరగనుంది. మొత్తం 24 విభాగాల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు. సాధారణంగా ప్రతి విభాగంలో 5 నామినేషన్లు ఉంటాయి, కానీ ‘ఉత్తమ చిత్రం’ (Best Picture) విభాగంలో మాత్రం 10 సినిమాలు నామినేట్ అవుతాయి. ఈ ఏడాది మొత్తం 317 సినిమాలు పోటీ పడగా, అందులో ప్రాథమిక నిబంధనలను పూర్తి చేసిన 201 చిత్రాలను అకాడమీ ఎంపిక చేసింది. వీటి నుండి ఓటింగ్ ద్వారా తుది 10 సినిమాలను ఎంపిక చేస్తారు.

ఎంపికైన భారతీయ చిత్రాలు:
  1. టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family): అభిషన్ జీవింత్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం. ఇందులో శశికుమార్ మరియు సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2025లో విడుదలై ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది.
  2. కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1): రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం. రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
  3. సిస్టర్ మిడ్‌నైట్ (Sister Midnight): రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో కరణ్ కాంధారి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం.
  4. తన్వీ ది గ్రేట్ (Tanvi The Great): అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం.

వీటితో పాటు, అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ‘మహా అవతార్ నరసింహ’ అనే యానిమేషన్ చిత్రం ‘ఉత్తమ యానిమేషన్’ విభాగంలో ఎంపికైంది. అలాగే, నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ (Homebound) చిత్రం అంతర్జాతీయ ఉత్తమ చిత్రాల (Best International Feature Film) రేసులో ఉంది. ముఖ్యంగా తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఈ జాబితాలో ఉండటంపై కోలీవుడ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: