మరణం అనేది ఎప్పుడూ ఒక పెద్ద మిస్టరీయే. ఒక వ్యక్తి మరణించే సమయంలో శ్వాస నెమ్మదించడం, గుండె చప్పుడు ఆగిపోవడం, కాళ్లూ చేతులూ చల్లబడటం మనం చూస్తుంటాం. కానీ ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి అసలు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? కళ్ల ముందు తెల్లని కాంతి కనిపిస్తుందా లేక పాత జ్ఞాపకాలు సినిమా రీల్ లాగా తిరుగుతాయా? శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ రహస్యంపై స్పష్టతనిచ్చారు.
మెదడులో ‘జ్ఞాపకాల సినిమా’:
‘Metro.co.uk’ నివేదిక ప్రకారం, శరీరం పని చేయడం ఆగిపోయినప్పటికీ, మెదడులోని కొన్ని భాగాలు కొద్దిసేపు చురుగ్గా ఉంటాయి. మరణానికి ముందు మెదడులో గామా ఆసిలేషన్స్ (Gamma Oscillations) అనే తరంగాలు విపరీతంగా పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు.
- జ్ఞాపకాల నెమరువేత: మనం కలలు కంటున్నప్పుడు లేదా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎలాంటి తరంగాలు వెలువడతాయో, మరణ సమయంలోనూ అవే కనిపిస్తాయి. అంటే మనిషి చనిపోయే ముందు తన జీవితంలోని మధుర క్షణాలను ఫ్లాష్‌బ్యాక్ లాగా చూస్తాడు. దీనినే శాస్త్రవేత్తలు ‘లైఫ్ రీకాల్’ (Life Recall) అని పిలుస్తున్నారు.
పరిశోధనలో తేలిన నిజాలు:
అమెరికాలోని లూయిస్విల్లే విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ అజ్మల్ జెమ్మర్ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
- 87 ఏళ్ల ఒక రోగికి గుండెపోటు వచ్చి మరణించినప్పుడు, ఆయన మెదడు పనితీరును (EEG) గమనించగా.. గుండె ఆగిపోయిన 30 సెకన్ల తర్వాత కూడా మెదడులో హై-లెవల్ యాక్టివిటీ ఉన్నట్లు గుర్తించారు.
- చనిపోయే సమయంలో మెదడు ఒక్కసారిగా ఆగిపోదు. అది మనల్ని మరణానికి సిద్ధం చేస్తూ, అత్యంత ప్రియమైన జ్ఞాపకాలను చివరిసారిగా అనుభవించే అవకాశం కల్పిస్తుంది.
ఆ తెల్లని కాంతి వెనుక సైన్స్:
చాలా మంది మరణం అంచు దాకా వెళ్లి వచ్చిన వారు తాము ఒక చీకటి సొరంగం గుండా వెళ్లామని, చివరలో తెల్లని కాంతి కనిపించిందని చెబుతుంటారు. దీనికి శాస్త్రవేత్తలు శాస్త్రీయ కారణాన్ని వివరించారు:
- టన్నెల్ విజన్: గుండె ఆగిపోయినప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల కంటిలోని రెటినా మరియు మెదడులోని విజువల్ కార్టెక్స్ మధ్య సంబంధం దెబ్బతింటుంది. అప్పుడు కంటి చూపు మందగించి, చుట్టూ చీకటిగా ఉండి కేవలం మధ్యలో మాత్రమే కాంతి కనిపిస్తుంది (Tunnel Vision). దీనినే ప్రజలు తెల్లని కాంతి అని భావిస్తారు.
ప్రశాంతతకు కారణం:
మరణం దగ్గర పడినప్పుడు మెదడు భారీగా ఎండార్ఫిన్లు (Endorphins) అనే రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి శరీరంలోని భయాన్ని, నొప్పిని తగ్గించి ఒక రకమైన వింతైన శాంతిని మరియు హాయిని కలిగిస్తాయి.
