ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో ఒక ఈ-రిక్షా డ్రైవర్ను పాము కరిచింది. అది సాదాసీదా పాము కాదు, అత్యంత విషపూరితమైన నాగుపాము. పాము కరిచిన వెంటనే ఆ డ్రైవర్ మధురలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ తనకు వెంటనే చికిత్స అందించడం లేదని కేకలు వేస్తూ గొడవ చేశాడు.
అక్కడున్న వారు “నిన్ను కరిచిన పాము ఎక్కడ?” అని అడగగా, అతడు చేసిన పనికి అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. తన జాకెట్ లోపల దాచి ఉంచిన ప్రాణమున్న నాగుపామును బయటకు తీసి అందరికీ చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పామును పట్టుకోవడం అవసరమా? చాలా మంది పాము రకాన్ని గుర్తించడానికి ఆ పామును వెంట తీసుకువెళ్లాలని భావిస్తారు. కానీ, ప్రాణమున్న పామును వెంట ఉంచుకోవడం ఆత్మహత్యతో సమానం. పాము రకం తెలిస్తే వైద్యులకు చికిత్స చేయడం సులభం అవుతుందనే మాట నిజమే కానీ, దానికోసం పామును పట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ రకం పాము (కట్లపాము, నాగుపాము లేదా రక్తపింజర) అని గుర్తు పట్టి చెబితే సరిపోతుంది. ఒకవేళ అది తెలియకపోయినా, వైద్యులు రక్త పరీక్షలు లేదా లక్షణాల ఆధారంగా ‘Polyvalent Anti-snake Venom’ చికిత్సను ప్రారంభిస్తారు.
పాము కరిచినప్పుడు చేయకూడని పనులు:
- పదరిపోవద్దు: పాము కరిచిన వ్యక్తి భయంతో కేకలు వేయడం లేదా పరుగులు తీయడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల గుండె వేగంగా కొట్టుకుని, రక్తం ద్వారా విషం శరీరం అంతటా త్వరగా పాకుతుంది.
- సినిమా తరహా ప్రయోగాలు: కరిచిన చోట బ్లేడుతో కోయడం లేదా నోటితో విషాన్ని పీల్చడం వంటివి అస్సలు చేయకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు రావడమే కాకుండా, విషం పీల్చే వ్యక్తికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది.
- గట్టిగా కట్టడం: గాయానికి పైన తాడుతో రక్తం ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు. దీనివల్ల ఆ అవయవానికి రక్త ప్రసరణ నిలిచిపోయి, తర్వాత ఆ భాగాన్ని తొలగించాల్సి రావచ్చు. కేవలం ఒక గుడ్డతో వదులుగా కడితే సరిపోతుంది.
పాము కరిచినప్పుడు సమయం వృధా చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడమే ప్రాణాలను కాపాడుకునే ఏకైక మార్గం. మధుర డ్రైవర్ లాగా పామును వెంట తీసుకెళ్లడం అత్యంత మూర్ఖత్వం.
