పి.ఎన్. పాఠక్ వ్యాఖ్యలతో బీజేపీలో టెన్షన్! లక్నో నుండి ఢిల్లీ వరకు ప్రకంపనలు..

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక రకమైన ‘డిజిటల్ యుద్ధం’ నడుస్తోంది. కుషీనగర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పి.ఎన్. పాఠక్ (PN Pathak) సోషల్ మీడియాలో వేసిన ఒక ఎత్తుగడ అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

గత నెలలో బ్రాహ్మణ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించి వార్తల్లో నిలిచిన పాఠక్, ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పోస్ట్ చేసి తన ఉద్దేశాన్ని చాటారు. ఇది కేవలం ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాదని, పార్టీ నాయకత్వంపై ఆయన చేస్తున్న పరోక్ష ‘యుద్ధ ప్రకటన’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజ్యాధికారం కాదు.. బాధితుల కష్టాలే ముఖ్యం

పి.ఎన్. పాఠక్ తన ట్వీట్‌లో ప్రసిద్ధ సంస్కృత శ్లోకాన్ని ప్రస్తావించారు:

“నాహం కామయే రాజ్యం, న స్వర్గం, న చ పునర్భవమ్। కామయే దుఃఖతప్తానాం, ప్రాణినామ్ ఆర్తినాశనమ్।।” (దీని అర్థం: నాకు రాజ్యం అక్కర్లేదు, స్వర్గం వద్దు, మోక్షం కూడా వద్దు; కేవలం కష్టాల్లో ఉన్న ప్రాణుల బాధలను తొలగించాలనే కోరిక మాత్రమే నాకు ఉంది.)

ఈ శ్లోకం ద్వారా తాను ఏ పదవిని ఆశించడం లేదని సందేశం ఇచ్చారు. అయితే, దాని కింద ఆయన రాసిన వాక్యాలు అసలు మంటను రాజేసాయి. “నిజాన్ని మాట్లాడటం మరియు అన్యాయాన్ని ఎదిరించడమే బ్రాహ్మణత్వం” అని ఆయన రాశారు. ‘అన్యాయాన్ని ఎదిరించడం’ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా రాజకీయాలో తనను లేదా తన సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నారనే అసంతృప్తిని ఆయన వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.

బ్రాహ్మణ ఎమ్మెల్యేల సమావేశం – ఒక హెచ్చరిక?

గత నెలలో పి.ఎన్. పాఠక్ సుమారు ఒక డజను మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అది సాధారణ సమావేశమేనని ఆయన చెప్పినప్పటికీ, పార్టీ హైకమాండ్ దీనిని ‘బ్రాహ్మణ లాబీ’గా పరిగణించింది. ఈ ఘటన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కుల ప్రాతిపదికన ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని సూచించింది. అయినప్పటికీ, తాజా ట్వీట్ చూస్తుంటే పాఠక్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

బ్రాహ్మణ సామాజిక వర్గంలో అసంతృప్తి?

లక్నో రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. పి.ఎన్. పాఠక్ చేస్తున్న ఈ పోరాటం బ్రాహ్మణ సామాజిక వర్గంలో గూడుకట్టుకున్న అసంతృప్తికి ప్రతిరూపం. తమ వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకులాగే కాకుండా, ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత మరియు గౌరవం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ అంతర్గత కలహాలను నిశితంగా గమనిస్తున్నాయి.


Posted

in

by

Tags: