ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక వ్యక్తికి ఆన్‌లైన్‌లో పరిచయమైన మహిళతో వాట్సాప్ స్నేహం చివరకు భారీ సైబర్ మోసానికి దారితీసింది. ఆ వ్యక్తి ఏకంగా ₹1.92 కోట్లు కోల్పోయాడు. అయితే, పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. అతనికి ఫోన్ చేసి బురిడీ కొట్టించింది అమ్మాయి కాదు, ఒక పురుషుడు!
ఏం జరిగిందంటే? లక్నోలోని మిశ్రీపూర్ డిపో ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ గాజీ (34) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ వాట్సాప్‌లో తన పేరును **’భావిక శెట్టి’**గా మార్చుకుని శలభ్ పాండే అనే వ్యక్తికి పరిచయం చేసుకున్నాడు. ప్రతిరోజూ మాట్లాడుతూ అతడి నమ్మకాన్ని చూరగొన్నాడు. ఆ తర్వాత, ఒక పథకంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి, శలభ్ పాండే నుండి విడతల వారీగా ₹1.92 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించుకున్నాడు.
మోసం బయటపడింది ఇలా: డబ్బులు పంపిన తర్వాత మోసపోయానని గ్రహించిన పాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఇమ్రాన్ గాజీ నకిలీ ఆధార్, పాన్ కార్డులతో బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఖాతాల నుండి సుమారు ₹54 లక్షలు చేతులు మారగా, నెలకు ₹1.52 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఈ ముఠాలోని ఇతర సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
