“మీరు చనిపోయారా?” అని మీ మొబైల్లోని ఒక యాప్ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏమనుకుంటారు? వినడానికి వింతగా ఉన్నా, చైనాలో ప్రస్తుతం ఈ యాప్ విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. “Are You Dead?” (చైనీస్ భాషలో ‘సిలే మే’) అనే ఈ యాప్ ఇప్పుడు ఆపిల్ యాప్ స్టోర్‌లో పెయిడ్ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ముగ్గురు ‘జెన్-జీ’ (Gen Z) పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చేసిన ఈ యాప్, ఒంటరిగా నివసించే వారి భద్రత కోసం రూపొందించబడింది.
ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? ఈ యాప్ కాన్సెప్ట్ చాలా సరళంగా ఉంటుంది.
- మీరు ప్రాణాలతో ఉన్నారని ధృవీకరించుకోవడానికి ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ యాప్‌ను ఓపెన్ చేసి చెక్ చేయాలి.
- ఒకవేళ యూజర్ వరుసగా రెండు రోజులు యాప్‌ను చెక్ చేయడంలో విఫలమైతే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ యూజర్ ముందుగా నమోదు చేసిన అత్యవసర కాంటాక్ట్ (కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు)కు ఈమెయిల్ లేదా నోటిఫికేషన్ పంపిస్తుంది.
- ఈ యాప్‌కు ఎలాంటి లాగిన్ లేదా వ్యక్తిగత డేటా అవసరం లేదు.
ఎందుకు ఇంత పాపులర్ అయింది? చైనాలో సుమారు 12.5 కోట్ల మంది ఒంటరిగా నివసిస్తున్నారు. నగరాల్లో ఉద్యోగాలు చేసే యువకులు, ఒంటరిగా ఉండే వృద్ధులు తాము ఇంట్లో చనిపోతే ఎవరికీ తెలియదేమో అన్న ఆందోళనతో (Safety Anxiety) ఉంటున్నారు. అలాంటి వారు ఈ యాప్‌ను ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మొదట్లో ఉచితంగా లభించిన ఈ యాప్, ఇప్పుడు సుమారు ₹103 (8 యువాన్లు) ధరకు లభిస్తోంది.
సామాజిక నేపథ్యం: 2030 నాటికి చైనాలో ఒంటరిగా ఉండేవారి సంఖ్య 20 కోట్లకు చేరుతుందని అంచనా. బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో ఒంటరిగా చనిపోయిన వారి మృతదేహాలు వారాల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఈ సమస్యకు పరిష్కారంగానే ఇలాంటి యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే, “మీరు చనిపోయారా?” అనే పేరు అశుభంగా ఉందని కొందరు అనడంతో, డెవలపర్లు దీని పేరును “మీరు బాగున్నారా?” అని మార్చే ఆలోచనలో ఉన్నారు.
