లంచ్ అయినా, డిన్నర్ అయినా ఇంట్లో అన్నం తప్పనిసరి. పప్పు లేదా కూరతో వేడివేడి అన్నం తింటే ఆ మజాయే వేరు. అయితే చాలామందికి కుక్కర్లో అన్నం వండినప్పుడు అది ముద్దగా అవ్వడమో లేదా కుక్కర్ నుండి నీరు బయటకు రావడమో జరుగుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అన్నం ఉడికించేటప్పుడు ఒక చిన్న చెంచా నూనె కలిపితే చాలు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
1. అన్నం పొడిపొడిగా వస్తుంది: కుక్కర్లో అన్నం వండినప్పుడు గింజలు ఒకదానికొకటి అంటుకుపోతుంటాయి. నీటిలో ఒక చెంచా నూనె వేయడం వల్ల, అది నీటిపై ఒక పొరలా ఏర్పడి బియ్యం గింజలు అధికంగా స్టార్చ్ (పిండి పదార్థం) పీల్చుకోకుండా చేస్తుంది. దీనివల్ల అన్నం ముద్దగా అవ్వకుండా ప్రతి గింజ విడివిడిగా, పొడిపొడిగా ఉంటుంది.
2. కుక్కర్ నుండి నీరు పొంగదు: అన్నం ఉడికేటప్పుడు కుక్కర్ విజిల్ నుండి నురగ లేదా నీరు బయటకు వచ్చి గ్యాస్ స్టవ్ అంతా గందరగోళంగా మారుతుంటుంది. నూనె కలపడం వల్ల నురగ రాదు, ఫలితంగా కుక్కర్ నుండి నీరు బయటకు పొంగదు. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో అన్నం వండేటప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
3. అన్నం మెరుస్తూ, మంచి సువాసనతో ఉంటుంది: నూనె కలపడం వల్ల వండిన అన్నం పైన ఒక రకమైన మెరుపు (Shine) వస్తుంది. దీనివల్ల అన్నం చూడటానికి హోటల్ అన్నంలా అందంగా ఉంటుంది. అలాగే అన్నం మంచి సువాసనను కూడా కలిగి ఉంటుంది.
4. అడుగు అంటదు: చాలాసార్లు కుక్కర్ అడుగున అన్నం అంటుకుపోతుంటుంది. నూనె వాడటం వల్ల అన్నం అడుగు భాగానికి అంటుకోదు మరియు మాడిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.
