వాషింగ్టన్: అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం (పెంటగన్)లో సాధారణం కంటే భిన్నంగా ఒక్కసారిగా పీజ్జా ఆర్డర్లు పెరిగిపోయాయి.
పెంటగన్ సమీపంలో పీజ్జా ఆర్డర్లు పెరగడం అంటే అమెరికా సైన్యం ఏదో పెద్ద ప్రణాళికను సిద్ధం చేస్తోందని అర్థం. దీనివల్ల అమెరికా ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మధ్యప్రాచ్య దేశాల్లో ఒకటైన ఇరాన్లో అక్కడి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ విషయంలో అమెరికా ఏదో భారీ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
పీజ్జా ఆర్డర్లకు, యుద్ధానికి సంబంధం ఏంటి?
పెంటగన్లో పీజ్జా ఆర్డర్లు పెరగడానికి, అమెరికా సైన్యం యాక్షన్‌కు సంబంధం ఏంటని మీకు సందేహం రావచ్చు. దీనినే ‘పీజ్జా మీటర్’ (Pizza Meter) అని పిలుస్తారు. పెంటగన్లో ఎప్పుడు పీజ్జా ఆర్డర్లు పెరుగుతాయో, అప్పుడు రక్షణ శాఖ ఏదో పెద్ద మిషన్ గురించి చర్చిస్తోందని అర్థం. పెద్ద ప్రాజెక్టులు లేదా దాడుల గురించి ప్లాన్ చేసేటప్పుడు అధికారులు, సిబ్బంది ఇంటికి వెళ్లకుండా కార్యాలయంలోనే గంటల తరబడి గడపాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో రాత్రిపూట ఓవర్‌టైమ్ పని చేసేటప్పుడు వారు పీజ్జాలను ఆర్డర్ చేస్తారు.
ఇరాన్ పరిస్థితి
ప్రస్తుతం ఇరాన్లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. వీటిని అణచివేయడానికి అక్కడి సైన్యం ప్రయత్నిస్తుండగా, మరణాల సంఖ్య 1000 దాటినట్లు వార్తలు వస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులు చేస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దీనికి తోడు బుధవారం ఒక ఇరాన్ టీవీ ఛానల్ డొనాల్డ్ ట్రంప్‌కు మరణ హెచ్చరిక జారీ చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
పీజ్జా ట్రాకర్ ఏం చెబుతోంది?
పెంటగన్ పీజ్జా ట్రాకర్ ‘ప్రస్తుతం ఏమీ జరగదు’ అనే స్థాయి నుండి ‘ఏదో జరగబోతోంది’ అనే స్థాయికి పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో పెంటగన్ సమీపంలోని పీజ్జా షాపులకు ఆర్డర్లు 256% పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఇరాన్ విషయంలో అమెరికా ఇక ఆలస్యం చేయకుండా చర్య తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం కానీ, పెంటగన్ కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
