వివాహేతర సంబంధం.. 40 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకున్న 67 ఏళ్ల వృద్ధుడు; మహిళను చంపి గుండెపోటుగా నాటకం.. బయటపడ్డ అసలు నిజం!

కర్ణాటక రాష్ట్రం, బాగల్‌కోట్ జిల్లా, జమఖండి తాలూకాకు చెందిన హీరేపదసలగి గ్రామంలో తన ప్రియురాలికి గుండెపోటు వచ్చిందని నాటకమాడి, ఆమెను హత్య చేసిన 67 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరణించిన మహిళను 40 ఏళ్ల యమనవ్వగా గుర్తించారు. ఆమె సుమారు 20 ఏళ్ల క్రితమే తన భర్త నుండి విడిపోయి, అదే ప్రాంతానికి చెందిన శ్రీశైల్ పాటిల్ (67) అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. అయితే, యమనవ్వకు మరో యువకుడితో సంబంధం ఉందన్న అనుమానం శ్రీశైల్ పాటిల్‌కు కలిగింది. ఈ నెల 14వ తేదీ రాత్రి తన ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

కోపంతో ఊగిపోయిన శ్రీశైల్ పాటిల్, యమనవ్వ గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయి, మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చి ఆమె గుండెపోటుతో చనిపోయిందని ఏడుస్తూ నాటకమాడాడు.

దీనిపై పోలీసులకు ఆయనే సమాచారం ఇచ్చాడు. అయితే యమనవ్వ శరీరంపై ఉన్న గాయాలను చూసిన పోలీసులు శ్రీశైల్ పాటిల్‌ను తమదైన శైలిలో విచారించగా, ఆయన మాటలు మార్చాడు. చివరికి ఆవేశంలో తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.


Posted

in

by

Tags: