ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో సహజీవనం (Live-in relationship) చేస్తున్న మహిళను ఆమె భాగస్వామే అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి తగులబెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
వివరాలు: రైల్వే రిటైర్డ్ ఉద్యోగి అయిన బ్రిజ్భాన్, తనతో కలిసి నివసిస్తున్న ప్రీతి (40) అనే మహిళను హత్య చేశాడు. హత్యను దాచిపెట్టడానికి, అతను ప్రతిరోజూ శరీరంలోని ఒక్కో భాగాన్ని కాల్చుతూ వచ్చినట్లు సమాచారం. శనివారం రాత్రి, మిగిలిపోయిన శరీర భాగాలను ఒక నీలిరంగు పెట్టెలో ఉంచుకుని, వాటిని పారేయడానికి ఒక ఆటోలో బయలుదేరాడు.
ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తి: ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ పెట్టె నుండి విపరీతమైన దుర్వాసన రావడంతో పాటు, దాని నుండి నీరు కారడం గమనించిన ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. డ్రైవర్ తనను ప్రశ్నిస్తాడని భయపడిన బ్రిజ్భాన్, ఆటోను మధ్యలోనే ఆపేసి అక్కడి నుండి పారిపోయాడు.
వెంటనే అప్రమత్తమైన ఆటో డ్రైవర్ తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ పెట్టెను తెరిచి చూడగా, అందులో సగం కాలిన శరీర భాగాలు, ఎముకలు ఉండటం చూసి విస్తుపోయారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఆధారాలతో పోలీసులు సిప్రీ బజార్ ప్రాంతంలో ఉన్న బ్రిజ్భాన్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
