భార్యాభర్తల మధ్య అవగాహనతో కూడిన జీవితం అనేది ఈ రోజుల్లో చాలా అరుదైపోయింది. కేవలం పరస్పర నమ్మకం ఉన్న కుటుంబాలు మాత్రమే నిలబడుతున్నాయి. నమ్మకం లేని చోట పుట్టిన అనుమానం వారి జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా ఒక జంట మధ్య జరిగిన సాధారణ గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది.
అసలేం జరిగింది? శ్రీలంకలోని మట్టకలపు జిల్లా, కొక్కట్టిచోళై పోలీస్ పరిధిలోని మునైక్కాడు ప్రాంతంలో అనుశ్వరన్ (36) అనే కూలీ తన భార్య ప్రహ్లాదదేవి (31) తో కలిసి నివసిస్తున్నాడు. పెళ్లయిన కొత్తలో వీరి జీవితం సాఫీగానే సాగింది, కానీ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
నిరూపించుకోమంటూ నిప్పు.. నిన్న ఉదయం కూడా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనుశ్వరన్ తన భార్య ప్రవర్తనపై అనవసరమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమెను దూషించాడు. కోపంతో ఊగిపోయిన అతను, “నువ్వు పతివ్రతవైతే, నీలో ఏ తప్పూ లేకపోతే నిరూపించుకో” అని సవాల్ విసిరాడు. వెంటనే వంటింట్లో ఉన్న కిరోసిన్‌ను తెచ్చి భార్య ఒంటిపై పోశాడు. అంతటితో ఆగకుండా అగ్గిపెట్టెను ఆమె చేతికి ఇచ్చి.. ఇప్పుడే నిప్పు అంటించుకుని నీ పవిత్రతను నిరూపించుకోమంటూ బలవంతం చేశాడు.
తీవ్ర గాయాలు – ఇద్దరి పరిస్థితి విషమం: భర్త మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ నిప్పు అంటించుకుంది. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకుంటూ వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం ఆమె శరీరం చాలా వరకు కాలిపోయి ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది.
ఇక భార్య మంటల్లో కాలిపోవడం చూసి అనుశ్వరన్ షాక్‌కు గురయ్యాడు. తానే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించానని భయపడి, వెంటనే కత్తి తీసుకుని తనను తాను పొడుచుకున్నాడు. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ ఆసుపత్రిలో అత్యంత విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు అనుశ్వరన్ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
