లోన్ EMI కట్టలేదని.. ఇల్లు తాకట్టు పెట్టిన వృద్ధ దంపతులను రోడ్డుపైకి గెంటేశారు! వారం రోజులుగా పశువులతో సహా వీధిన పడ్డ వైనం

వృద్ధ దంపతులిద్దరూ రోడ్డు పక్కన తలదాచుకుంటున్నారు. వారితో పాటు వారు పెంచుకుంటున్న ఆవులు కూడా అక్కడే ఉన్నాయి. ఈ దంపతులకు సాయం చేసే వారు ఎవరూ లేరు. వానలో తడుస్తూ వారు నిస్సహాయంగా రోడ్డుపై పడి ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

అసలేం జరిగింది? కర్ణాటక  హాసన్ జిల్లా, అరకలగూడు తాలూకా కొరటగెరె గ్రామానికి చెందిన చెన్నయ్య (80), ఆయన భార్య జయమ్మ (75) నిరుపేద వృద్ధ దంపతులు. వీరికి ఒకే కుమారుడు ఉన్నాడు. అతను క్యాన్సర్ బారిన పడటంతో, అతని చికిత్స కోసం 2023లో తమ సొంత ఇంటిని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ. 2 లక్షల అప్పు తీసుకున్నారు. ఏడాది వరకు సక్రమంగా వాయిదాలు (EMI) చెల్లించారు.

ఇల్లు జప్తు – రోడ్డుపైకి వృద్ధులు: వైద్య ఖర్చులు పెరగడం, ఆదాయం లేకపోవడంతో గత కొద్ది నెలలుగా వారు వాయిదాలు చెల్లించలేకపోయారు. దీంతో సదరు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెబుతూ, వారం క్రితం ఈ దంపతులను ఇంటి నుండి బలవంతంగా బయటకు గెంటేశారు. ఇంటికి తాళం వేయడమే కాకుండా, పశువుల పాకను కూడా సీల్ చేశారు. కనీసం తమ సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని ఆ వృద్ధులు కన్నీరుమున్నీరవుతున్నారు.

రోడ్డుపైనే వంట.. ఆకలితో పశువులు: వెళ్లడానికి వేరే చోటు లేక, ఆ వృద్ధ దంపతులు తమ ఆవులతో సహా రోడ్డు పక్కనే మకాం వేశారు. నడిరోడ్డుపై రాళ్లతో పొయ్యి చేసి వంట చేసుకుంటున్నారు. “మాకే ఉండటానికి చోటు లేదు, తాగడానికి నీళ్లు లేవు.. ఈ మూగజీవాలను ఎక్కడికి తీసుకెళ్లాలి?” అని వారు అడుగుతున్న తీరు ఎవరినైనా కలిచివేస్తుంది. వారం రోజులుగా పశువులకు మేత వేయడానికి కూడా చోటు లేక అవి ఆకలితో అలమటిస్తున్నాయి.

ప్రభుత్వానికి విన్నపం: వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా, మానవత్వం లేకుండా ఫైనాన్స్ కంపెనీ ప్రవర్తించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ ఇంటిని తమకు అప్పగించాలని లేదా ప్రభుత్వం ఏదైనా దారి చూపాలని ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.


Posted

in

by

Tags: