పుదుచ్చేరిలో గత పది నెలలుగా సుమారు 8 లక్షల రూపాయల విలువైన కోడి మాంసాన్ని దొంగిలించి, హోటళ్లకు తక్కువ ధరకు అమ్ముకుంటూ సొంతంగా ‘సైడ్ బిజినెస్’ నడుపుతున్న నలుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే: పుదుచ్చేరి, విలియనూర్ ప్రాంతానికి చెందిన సుజన్ (24) సుల్తాన్ పేటలో చికెన్ షాపు నడుపుతున్నాడు. అతని వద్ద అజార్, ఇస్మాయిల్, జలాల్, భాస్కరన్ అనే నలుగురు యువకులు పని చేస్తున్నారు. వీరు సుజన్ వద్ద ఎంతో నమ్మకస్థులుగా పేరు తెచ్చుకున్నారు. “మేముండగా మీకేం భయం లేదు ముతలాళి (యజమాని), మీరు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి” అని చెప్పి యజమానిని నమ్మించి ముంచేశారు.
దొంగతనం చేసిన తీరు: ఎవరైనా కస్టమర్ ఒక కిలో చికెన్ అడిగితే, వీరు కిలోన్నర మాంసాన్ని కోసేవారు. అందులో కస్టమర్‌కు కిలో ఇచ్చి, మిగిలిన అరకిలో మాంసాన్ని పక్కన పెట్టేవారు. ఇలా రోజుకు 10 నుండి 15 కిలోల మాంసాన్ని దొంగిలించేవారు. రోజూ సాయంత్రం “కోడి వ్యర్థాలను పారేసి వస్తాం” అని చెప్పి ఒక సంచిని బయటకు తీసుకెళ్లేవారు. ఆ వ్యర్థాల అడుగున దొంగిలించిన చికెన్‌ను దాచి బయటకు తరలించేవారు. అలా తీసుకెళ్లిన మాంసాన్ని చిన్న చిన్న హోటళ్లకు తక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బును నలుగురూ సమానంగా పంచుకునేవారు.
వెలుగులోకి వచ్చిన వైనం: వ్యాపారం బాగానే జరుగుతున్నా, లెక్కలు చూస్తే రూపాయి కూడా లాభం రాకపోవడంతో యజమాని సుజన్‌కు అనుమానం వచ్చింది. పక్కా ప్లాన్‌తో నిఘా పెట్టాడు. ఒకరోజు అజార్ అనే సిబ్బంది వ్యర్థాల సంచిని తీసుకెళ్తుండగా, సుజన్ దానిని ఆపి తనిఖీ చేశాడు. ఆ సంచిలో 10 కిలోల మంచి మాంసం బయటపడటంతో సుజన్ షాక్ తిన్నాడు.
నిలదీయగా, “అయ్యా! నేను ఒక్కడినే కాదు, మేమంతా కలిసి ఈ పని చేస్తున్నాం” అని అజార్ నిజం ఒప్పుకున్నాడు. ఎన్ని రోజులుగా ఈ పని చేస్తున్నారని అడగ్గా, గత పది నెలలుగా అని చెప్పడంతో యజమాని హతాశుడయ్యాడు. పది నెలల్లో సుమారు 8 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని గుర్తించిన సుజన్, పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విలియనూర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
