రాత్రి నిద్రలో మూత్రవిసర్జన కోసం లేవడం అనేది సాధారణ విషయంగానే చాలామంది భావిస్తారు. కానీ మీకు ప్రతిరోజూ ఇలా జరుగుతుంటే అది సాధారణం కాదు. వయసు పెరగడం, ప్రోస్టేట్ సమస్య లేదా మూత్రాశయం బలహీనపడటం వల్ల మాత్రమే ఇలా జరుగుతుందని అనుకుంటారు. కానీ ప్రముఖ అమెరికన్ డాక్టర్ ఎరిక్ బర్గ్ అభిప్రాయం ప్రకారం.. ప్రతిసారీ ఇవే కారణాలు కానక్కర్లేదు. ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ సమస్య వెనుక ఉన్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల గురించి వివరించారు.
రాత్రి ఎన్నిసార్లు మూత్ర విసర్జన సాధారణం? డాక్టర్ బర్గ్ ప్రకారం.. రాత్రిపూట ఒకసారి మూత్రం కోసం లేవడం సాధారణం అనుకోవచ్చు. కానీ ప్రతిరోజూ రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు నిద్ర లేవాల్సి వస్తుంటే, అది మీ నిద్రను మరియు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల నిరంతరం అలసటగా ఉండటమే కాకుండా.. భవిష్యత్తులో మధుమేహం (Diabetes), రక్తపోటు (High BP) మరియు బరువు పెరిగే ప్రమాదం ఉంది.
తరచుగా మూత్రం రావడానికి కారణాలేంటి? రాత్రిపూట మూత్రం పరిమాణాన్ని నియంత్రించే యాంటీ-డయూరెటిక్ హార్మోన్ (ADH) సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రాత్రిపూట ఎక్కువ మూత్రం తయారవుతుంది. దీనికి గల కొన్ని కారణాలు:
- శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉండి, పొటాషియం తక్కువగా ఉండటం.
- రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం.
- సాయంత్రం వేళ ఎక్కువ నీరు తాగడం.
- మద్యం లేదా కెఫీన్ (టీ, కాఫీ) ఎక్కువగా తీసుకోవడం.
- రాత్రిపూట తీపి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినడం.
- రాత్రి భోజనంలో ప్రొటీన్లు అధికంగా ఉండటం.
కాళ్ల వాపులు కూడా ఒక సంకేతమే: మీ కాళ్లు లేదా చీలమండల వద్ద వాపు ఉండి, వేలితో నొక్కినప్పుడు గుంత పడుతుంటే (Pitting Edema), శరీరంలో నీరు చేరిందని అర్థం. రాత్రి మీరు పడుకున్నప్పుడు ఆ నీరు మళ్లీ రక్తంలోకి చేరి, కిడ్నీల ద్వారా మూత్రం రూపంలో బయటకు వస్తుంది.
సమస్య నుండి బయటపడటం ఎలా?
- నీరు: నిద్రపోయే 3 గంటల ముందు నుండే నీరు తాగడం తగ్గించాలి.
- పానీయాలు: సాయంత్రం తర్వాత మద్యం, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి.
- ఆహారం: రాత్రి స్నాక్స్ తినడం మానేయాలి. తీపి, ఉప్పు మరియు పిండి పదార్థాలు (Carbs) తగ్గించాలి.
- లఘు భోజనం: రాత్రి భోజనం తేలికగా ఉండాలి, ప్రొటీన్లు మితంగా తీసుకోవాలి.
- పొటాషియం: పగటిపూట అరటిపండ్లు, ఆకుకూరలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- పోషకాలు: మెగ్నీషియం మరియు విటమిన్ B1 లోపం లేకుండా చూసుకోవాలి.
