ఉత్తరప్రదేశ్లోని హర్దోయీ జిల్లాలో ఒక వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక నిరుపేద కూలీకి ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఏకంగా 7 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి నోటీసులు పంపింది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఈ యువకుడి పేరుతో భారీ మోసం జరిగింది.
అసలేం జరిగింది? హర్దోయీ జిల్లా రుదామౌ గ్రామానికి చెందిన గోవింద్ అనే యువకుడు ఇటుక బట్టీల్లో, ఫ్యాక్టరీల్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జనవరి 8న ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి అతనికి ఒక నోటీసు అందింది. అది చూసి గోవింద్ కుటుంబం ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆ నోటీసు ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సీతాపూర్లోని ఒక బ్యాంకు ఖాతా ద్వారా 7 కోట్ల 15 లక్షల 92 వేల 786 రూపాయల లావాదేవీలు జరిగాయి. గోవింద్ ఎలాంటి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో, ఆ మొత్తాన్ని అప్రకటిత ఆదాయంగా భావించి భారీ జరిమానా చెల్లించాలని అధికారులు నోటీసు ఇచ్చారు.
నిరుపేద బతుకు – కోట్లలో నోటీసులు: వాస్తవానికి గోవింద్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక చిన్న పూరి గుడిసె, ఒంటి మీద చిరిగిన బట్టలు, పూట గడవడమే కష్టంగా ఉన్న స్థితి. నోటీసు వచ్చినప్పటి నుండి ఆ ఇంట్లో భయం, ఆందోళన నెలకొన్నాయి. అతని తండ్రి రామచంద్ర కశ్యప్, తల్లి కమలా దేవి తమ కుమారులు కూలీ పనులు చేసుకుని బతుకుతున్నారని, తమకు అంత డబ్బు ఎక్కడిదని కన్నీరుమున్నీరవుతున్నారు.
మోసం జరిగింది ఇలా: సుమారు ఆరేళ్ల క్రితం గోవింద్ కాన్పూర్లోని ఒక గుట్కా కంపెనీలో పనికి వెళ్లాడు. అక్కడ ఒక మహిళ అతనికి ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు వస్తాయని నమ్మించి సీతాపూర్లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో ఖాతా తెరిపించింది. ఆ సమయంలో అతనికి రెండు మూడు వేల రూపాయలు ఇచ్చి, పాస్బుక్ మరియు మిగిలిన కాగితాలన్నీ ఆ గ్యాంగ్ తమ వద్దే ఉంచుకుంది. ఆ తర్వాత గోవింద్ ఊరికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. కానీ అతని పేరుతో ఉన్న ఆ ఖాతా ద్వారా కేటుగాళ్లు కోట్ల రూపాయల బ్లాక్ మనీని చలామణి చేసినట్లు తెలుస్తోంది.
