తిరువనంతపురం: కేరళలోని నెయ్యట్టింకరలో ఏడాది వయసున్న పసికందు మృతి చెందిన ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది. పోస్ట్మార్టం రిపోర్ట్ (Postmortem report) వస్తే అసలు నిజం తెలుస్తుందని భావించిన పోలీసులకు కూడా పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే, శవపరీక్ష నివేదికలోనూ అనేక మిస్టరీ కోణాలు బయటపడ్డాయి.
మృతి చెందిన బాబును ఇహాన్ (అప్పు)గా గుర్తించారు. షిజిన్ మరియు కృష్ణప్రియ దంపతుల ఏకైక కుమారుడు ఇతను. కంజిరామ్కులం సమీపంలోని తవ్వావిలలో ఉన్న తన ఇంట్లో బాబు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బాబు కడుపులో గాయం మరియు అంతర్గత రక్తస్రావం (Internal Bleeding) వల్ల మరణం సంభవించిందని పోస్ట్మార్టం నివేదికలో పేర్కొన్నారు. అయితే, బిస్కెట్లు తిన్న తర్వాత బాబు స్పృహ తప్పి పడిపోయాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనితో బాబు మరణం వెనుక మిస్టరీ కొనసాగుతోంది.
తల్లిదండ్రుల వాదన: తండ్రి కొనుగోలు చేసిన బిస్కెట్లను తిన్న అరగంట తర్వాత ఇహాన్ కుప్పకూలిపోయాడని తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే అతడిని నెయ్యట్టింకర జనరల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. కానీ, శవపరీక్షలో కడుపులో గాయం మరియు రక్తస్రావం అని తేలడంతో కేసు గందరగోళంగా మారింది.
కుటుంబ సభ్యుల ఆరోపణలు: బాబు మరణం సహజమైనది కాదని, ఇందులో ఏదో మర్మం ఉందని బాబు తల్లి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షిజిన్ మరియు కృష్ణప్రియల మధ్య గతంలో గొడవలు ఉండేవని, వారు ఇటీవలే మళ్ళీ కలిసి ఉండటం ప్రారంభించారని బంధువులు చెబుతున్నారు. దీనితో పోలీసులకు కూడా అనుమానం కలిగింది.
మెడలో ఎముకలు విరగడం: విచారణ సమయంలో అనుమానాస్పద సమాచారం ఏమీ లభించకపోవడంతో మొదట తల్లిదండ్రులను పోలీసులు వదిలిపెట్టారు. అయితే, పోస్ట్మార్టం నివేదికలో బాబు మెడ భాగంలో మూడు చోట్ల ఎముకలు విరిగినట్లు (Fractures) తేలిందని పోలీసులు తెలిపారు. ఈ గాయాలు ఎలా జరిగాయని ప్రశ్నిస్తే.. తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు పెను సంచలనంగా మారింది.
