2026 సంవత్సరం ప్రారంభం నుండే ధరల పెరుగుదల సామాన్యుడిని వేధిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పిల్లల విద్యా ఖర్చులు, బీమా ప్రీమియంలు.. ఇలా అన్నీ కలిసి సామాన్యుడి జేబును ఖాళీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ఏదైనా ఊరటనిస్తుందా అని పన్ను చెల్లింపుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సెక్షన్ 80C పరిమితి పెంపు? పారిశ్రామిక సంఘం ‘AMCHAM’, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 1.5 లక్షల నుండి రూ. 3.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి విన్నవించింది.
10 ఏళ్లుగా మారని పరిమితి: 2014 తర్వాత సెక్షన్ 80C పరిమితిలో ప్రభుత్వం ఎటువంటి మార్పు చేయలేదు. గత పదేళ్లలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినప్పటికీ, పెట్టుబడుల ద్వారా పన్ను ఆదా చేసే పరిమితి మాత్రం రూ. 1.5 లక్షల వద్దే నిలిచిపోయింది. ఒకవేళ ఈ పరిమితిని రూ. 3.5 లక్షలకు పెంచితే, ఉద్యోగస్తులు సంవత్సరానికి వేల రూపాయల పన్నును ఆదా చేసుకోవచ్చు.
పాత పన్ను విధానానికే (Old Tax Regime) ప్రయోజనం: సెక్షన్ 80C కింద లభించే ఈ ప్రయోజనం కేవలం ‘ఓల్డ్ టాక్స్ రిజీమ్’ ఎంచుకునే వారికి మాత్రమే అందుతుంది. ప్రభుత్వం ‘న్యూ టాక్స్ రిజీమ్’ను ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇప్పటికీ మెజారిటీ ప్రజలు పెట్టుబడుల ద్వారా పన్ను ఆదా చేసుకునేందుకు పాత పద్ధతినే ఇష్టపడుతున్నారు.
బీమా ప్రీమియంపై అదనపు మినహాయింపు? కేవలం 80C పరిమితి పెంచడమే కాకుండా, బీమా ప్రీమియంల కోసం కనీసం రూ. 2.5 లక్షల వరకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కూడా సిఫార్సు చేశారు. కరోనా తర్వాత హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్‌ల ప్రాముఖ్యత పెరిగింది, అదే సమయంలో వాటి ప్రీమియంలు కూడా భారంగా మారాయి.
ఫిబ్రవరి 1పైనే అందరి కన్ను: ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న (ఆదివారం) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 80C పరిమితిని పెంచే నిర్ణయం తీసుకుంటే, అది మధ్యతరగతి ప్రజలకు పెద్ద ‘మాస్టర్ స్ట్రోక్’ అవుతుంది. దీనివల్ల పొదుపు సామర్థ్యం పెరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుంది.
