గుజరాత్ రాష్ట్రంలో వృద్ధులనే లక్ష్యంగా చేసుకుని రాజస్థాన్‌కు చెందిన ఒక ముఠా వినూత్న రీతిలో మోసాలకు పాల్పడింది. వయసు మళ్లిన వారికి ఉండే కీళ్ల నొప్పుల (Joint Pains) సమస్యను ఆసరాగా చేసుకుని, వారికి ఫిజియోథెరపీ చేస్తామంటూ ఈ ముఠా నమ్మించింది.
మోసం జరిగింది ఇలా: అహ్మదాబాద్‌లో ఒంటరిగా నివసిస్తున్న ఓ 85 ఏళ్ల వృద్ధుడికి తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉన్నాయి. అతని ముగ్గురు కుమారులు ప్రభుత్వ ఉద్యోగులు. అతను ఆసుపత్రికి వెళ్తుండగా గమనించిన ఈ ముఠా.. తాము కీళ్ల నొప్పులను పూర్తిగా నయం చేస్తామని అతనికి నమ్మబలికారు. ‘డాక్టర్ దివాన్’ అనే ప్రముఖ వైద్యుడి పేరు చెప్పి, ఆ డాక్టర్ ద్వారానే చికిత్స అందిస్తామని నమ్మించారు. వృద్ధుడికి నమ్మకం కలిగించడానికి, తమ ముఠాలోని ఒక వ్యక్తితో ఫోన్ చేయించి.. తన తల్లికి రూ. 15 లక్షలు ఖర్చు చేసినా తగ్గని నొప్పి ఈ డాక్టర్ చికిత్సతో తగ్గిందని అబద్ధాలు చెప్పించారు.
నల్ల రక్తం పేరుతో దోపిడీ: చికిత్స పేరుతో వృద్ధుడి ఇంటికి వెళ్లిన ముఠా సభ్యులు, అతని శరీరంలో సూదులు గుచ్చి.. చేతివాటంతో ‘నల్లటి రక్తపు గడ్డలు’ బయటకు తీసినట్లు నటించారు. ఈ నల్ల రక్తమే నొప్పులకు కారణమని, ఒక్కో చుక్క తీయడానికి రూ. 7,000 అవుతుందని చెప్పారు. మొదటి రోజే ఆ వృద్ధుడి నుండి రూ. 4 లక్షలు వసూలు చేశారు. ఇంకా చికిత్స అవసరమని చెప్పడంతో, ఆ వృద్ధుడు తన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) నుండి రూ. 2.7 లక్షలు తీసి వారికి ఇచ్చాడు.
బ్యాంకు అధికారి అప్రమత్తత: వృద్ధుడు పదే పదే డబ్బులు విత్ డ్రా చేస్తుండటం గమనించిన బ్యాంకు అధికారికి అనుమానం వచ్చింది. ఎవరో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని బెదిరిస్తున్నారని భావించి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి విచారించగా అసలు మోసం బయటపడింది. పోలీసులు ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన మొహమ్మద్ అమ్జద్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుండి రూ. 6.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
