రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని అందరూ చెబుతుంటారు. అందుకే ఆరోగ్యకరమైన ఆహార జాబితాలో గుడ్డుకు ప్రధాన స్థానం ఉంది. అయితే, గుడ్డు తినడం వల్ల బరువు పెరుగుతారా? కొలెస్ట్రాల్ పెరుగుతుందా? కాలేయం దెబ్బతింటుందా? వంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. వీటన్నింటికీ డాక్టర్ సౌరభ్ సేథి ఇన్స్టాగ్రామ్ వేదికగా సమాధానమిచ్చారు.
ప్రశ్నలు – సమాధానాలు:
- గుడ్డు మంచి అల్పాహారమా (Breakfast)? అవును, గుడ్లు ప్రోటీన్‌కు అత్యుత్తమ వనరు. ఇవి తింటే కడుపు నిండుగా అనిపించి రోజంతా శక్తిని ఇస్తాయి. దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినకుండా ఉండవచ్చు.
- ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) సమస్య ఉన్నవారు గుడ్లు తినవచ్చా? పరిమిత పరిమాణంలో తింటే గుడ్లు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించి కాలేయ సమస్య ఉన్నవారికి సహాయపడతాయి.
- గుడ్ల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? చాలా మంది ఆరోగ్యవంతులలో గుడ్లు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా పెంచవు. శరీర అవసరానికి అనుగుణంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించే సామర్థ్యం గుడ్డుకు ఉందని డాక్టర్ వివరించారు.
- బరువు తగ్గడానికి గుడ్లు సహాయపడతాయా? ఖచ్చితంగా! అధిక ప్రోటీన్ కారణంగా ఇవి ఆకలిని నియంత్రించి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
- గుడ్లు రక్తంలో చక్కెర (Sugar) స్థాయిని పెంచుతాయా? లేదు. గుడ్లలో పిండి పదార్థాలు (Carbohydrates) చాలా తక్కువ. కాబట్టి ఇవి షుగర్ లెవల్స్‌ను పెంచవు. మధుమేహం ఉన్నవారికి ఇది సురక్షితమైన ఆహారం.
- గుడ్లను కాఫీ లేదా గ్రీన్ టీతో కలిపి తీసుకోవచ్చా? అవును, కాఫీ లేదా గ్రీన్ టీతో కలిపి గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టం కలగదు.
- గుడ్లు తింటే కడుపు ఉబ్బరంగా (Bloating) అనిపిస్తుందా? కొంతమందికి జీర్ణ సమస్యలు లేదా అలర్జీ ఉండవచ్చు. అలాంటి వారు తీసుకునే పరిమాణాన్ని తగ్గించడం లేదా వండే పద్ధతిని మార్చుకోవడం మంచిది.
- పచ్చి గుడ్లు తాగడం సురక్షితమేనా? కాదు. పచ్చి గుడ్ల వల్ల ‘సాల్మొనెల్లా’ వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పైగా పచ్చి గుడ్ల కంటే ఉడికించిన గుడ్లలోని ప్రోటీన్‌ను శరీరం త్వరగా గ్రహిస్తుంది.
గుడ్లు తినడానికి సరైన మార్గం: ఉడికించిన గుడ్లు (Boiled Eggs), పోచ్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్.. ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి సరిపోతుంది.
