న్యూయార్క్: ప్రపంచ యుద్ధం మరియు వాణిజ్య యుద్ధం (Trade War) వస్తుందనే భయంతో అమెరికా స్టాక్ మార్కెట్ ఒక్కరోజే సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది.
దీని భారతీయ విలువ అక్షరాలా ₹1,40,00,000 కోట్లు (140 లక్షల కోట్లు). అక్టోబర్ తర్వాత అమెరికా మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. అమెరికా-యూరోప్ మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు, దానివల్ల తలెత్తిన పన్నుల ముప్పు మరియు కెనడా-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ఈ పతనానికి ప్రధాన కారణాలయ్యాయి. దీనివల్ల ఎంతోమంది మధ్యతరగతి ప్రజలు తమ పెట్టుబడులను కోల్పోయారు.
యుద్ధ భయంతో డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉండటంతో, పెట్టుబడిదారులు మార్కెట్ల నుండి బయటకు వచ్చారు. ఫలితంగా మార్కెట్లు కుప్పకూలాయి.
కొనసాగుతున్న అమెరికా వాణిజ్య పతనం
స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించడంతో పెట్టుబడిదారులు అన్ని రంగాల షేర్లను విక్రయించి బయటకు వచ్చారు. డౌ జోన్స్ (Dow Jones) 1.8% తగ్గి 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. S&P 500 సూచీ 2%, నాస్డాక్ (Nasdaq) 2.4% పైగా పతనమయ్యాయి. ఈ పతనం వల్ల ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
గ్రీన్‌లాండ్ కొనుగోలు ఒప్పందం కుదరకపోతే, ఎనిమిది నాటో (NATO) దేశాలపై 10% దిగుమతి సుంకాలు విధిస్తామని ట్రంప్ గత వారం హెచ్చరించారు. సుమారు 108 బిలియన్ డాలర్ల మేర పన్నులు విధిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్య చేపట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ బహిరంగంగా ప్రకటించడం యుద్ధ భయాలను పెంచింది.
విడిపోతున్న నాటో (NATO) కూటమి
డెన్మార్క్ నుండి గ్రీన్‌లాండ్‌ను దక్కించుకునే క్రమంలో యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ కొత్త పన్నులు విధించడంతో నాటో కూటమి విచ్ఛిన్నమయ్యే స్థితికి చేరుకుంది. దీనికి ప్రతిచర్యగా యూరోపియన్ పార్లమెంట్ అట్లాంటిక్ వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేసింది.
ఆర్కిటిక్ ద్వీపానికి దళాలను పంపిన యూరోపియన్ దేశాలపై 10% అదనపు కస్టమ్స్ సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ నిన్న ప్రకటించారు. జూన్ 1 నుండి ఈ పన్ను 25%కి పెరుగుతుందని, గ్రీన్‌లాండ్ కొనుగోలు ఒప్పందం పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని, దాన్ని అడ్డుకునే దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ట్రంప్ ప్రకటనల వల్లే మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి.
