తమిళనాడు : తిరునెల్వేలి జిల్లా తచ్చు కుడియిరుప్పు ప్రాంతానికి చెందిన రామరాజ్కు రాధిక (28) అనే కుమార్తె, కన్నన్ (25) అనే కుమారుడు ఉన్నారు. రాధిక వివాహం కాకుండా ఇంట్లోనే ఉంటోంది. తమ్ముడు కన్నన్ తొమ్మిదో తరగతి వరకు చదివి, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
వివాహితుడితో సంబంధం ఇంట్లోనే ఉంటున్న రాధికకు అదే ప్రాంతానికి చెందిన ఒక వివాహితుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. తరచుగా వీరిద్దరూ ఏకాంతంగా గడపడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
కుటుంబ పరువు పోతోందని గొడవ అక్క ప్రవర్తన గురించి తెలిసిన కన్నన్, ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. దీనివల్ల అక్కాతమ్ముళ్ల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. రాధిక ప్రవర్తన గురించి ఇరుగుపొరుగు వారు, ఊరి జనం కూడా తప్పుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది విన్న కన్నన్ మరింత ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యాడు. “నీ వల్లే మన కుటుంబం పరువు బజార్న పడుతోంది” అని నిలదీస్తూ గొడవపడేవాడు.
కొడవలితో దాడి బుధవారం మరోసారి వీరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపం కట్టలు తెంచుకోవడంతో కన్నన్ ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకువచ్చాడు. కన్నబిడ్డలా చూడాల్సిన అక్క అని కూడా చూడకుండా రాధికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాధిక ఆర్తనాదాలు విని పొరుగువారు పరుగెత్తుకు వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
తమ్ముడి అరెస్ట్ స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాధిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారయ్యేందుకు ప్రయత్నించిన కన్నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగా సొంత అక్కనే తమ్ముడు హత్య చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
