లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని పీజీఐ (PGI) ప్రాంతంలో జరిగిన ప్రదీప్ సింగ్ హత్య కేసును పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణలో విస్తుపోయే నిజాలను వెల్లడించారు.
మంగళవారం అర్థరాత్రి ప్రదీప్ సింగ్ గొంతు కోసి హత్య చేయబడ్డాడు. అతని మృతదేహం రోడ్డుపై పడి ఉండగా, భార్య పూజ శవం వద్ద భోరున విలపించడం చూసి స్థానికులందరూ చలించిపోయారు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రదీప్‌ను హత్య చేసింది ఎవరో కాదు, అతని భార్య పూజ తన ప్రియుడితో కలిసి ఈ ప్లాన్ వేసింది.
స్నేహితుడే హంతకుడు
పోలీసులు ప్రదీప్ భార్య పూజను, ఆమె ప్రియుడు రామ్ తీరథ్ మౌర్యను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రామ్ తీరథ్ ప్రదీప్‌కు మంచి స్నేహితుడు. ప్రదీప్ ఇంటికి తరచుగా వెళ్లే క్రమంలో అతనికి పూజతో అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి వ్యవహారానికి ప్రదీప్ అడ్డుగా మారుతున్నాడని భావించి, అతడిని అడ్డుతొలగించుకోవాలని పథకం రచించారు.
పక్కా ప్లాన్‌తో హత్య
పూజ ఆదేశాల మేరకు, రామ్ తీరథ్ మంగళవారం రాత్రి ప్రదీప్‌కు అతిగా మద్యం తాగించాడు. అనంతరం ప్రదీప్‌ను బైక్ నడపమని చెప్పి, రామ్ తీరథ్ వెనుక కూర్చున్నాడు. బైక్ వెళ్తుండగానే వెనుక నుంచి ప్రదీప్ గొంతును కత్తితో కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఏమీ తెలియనట్లు పూజ ఏడుస్తున్న వీడియో అప్పట్లో వైరల్ కాగా, ఇప్పుడు ఆమె కిరాతకం బయటపడటంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
