ఇద్దరు మేజర్లు (వయసు పైబడిన వారు) పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగి ఉంటే, వారు పెళ్లి చేసుకోకపోయినా దానిని అత్యాచారంగా పరిగణించలేమని పాట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రేమ సంబంధం విఫలమైన తర్వాత, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతో నమోదయ్యే కేసుల విషయంలో కోర్టు ఈ స్పష్టతనిచ్చింది.
కేసు వివరాలు: భాగల్పూర్కు చెందిన మహ్మద్ సైఫ్ అన్సారీ కేసును విచారించిన జస్టిస్ సోనీ శ్రీవాస్తవ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా దిగువ కోర్టుల పనితీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టులు కేవలం రికార్డులను పంపే పోస్ట్ ఆఫీసుల లాగా కాకుండా, ప్రాథమికంగా ఆ నేరం జరిగిందా లేదా అనేది పరిశీలించి అభియోగాలు నమోదు చేయాలని సూచించింది.
నమ్మించి మోసం చేయడం vs పెళ్లి చేసుకోలేకపోవడం: “తప్పుడు వాగ్దానాలు” మరియు “పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోలేకపోవడం” మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైకోర్టు వివరించింది. మొదటి నుండి మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటేనే దానిని నేరంగా పరిగణించవచ్చు. కానీ, ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా ఒక ఏడాది పాటు కలిసి ఉండి, ఆ తర్వాత ఏదో ఒక కారణం వల్ల పెళ్లి చేసుకోలేకపోతే దానికి “నేర స్వభావం” ఆపాదించడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ఉటంకిస్తూ, సంబంధం విఫలమైనప్పుడు సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసు పెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని కోర్టు స్పష్టం చేసింది.
