నటి ఊర్వశి సోదరుడు, నటుడు కమల్ రాయ్ కన్నుమూత… నేడు అంత్యక్రియలు… సినీ ప్రముఖుల సంతాపం!

మలయాళ చిత్ర పరిశ్రమలో తన సహజ సిద్ధమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ రాయ్, అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు ఏవీ లేకపోయినా, ఆయన హఠాన్మరణం చెందడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

తమిళంలో ‘పుదుసా పడిక్కిరేన్ పాడు’ అనే చిత్రం ద్వారా ఆయన పరిచయమయ్యారు. కేరళలో ఎంతో ప్రాచుర్యం పొందిన కమల్ రాయ్, అక్కడ అగ్ర తారలతో కలిసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సాయుజ్యం, కొల్లిలకం, మంజు, కింగిణి, కళ్యాణసౌగంధికం, వాసలం, శోభనం వంటివి ఆయన నటనలో వచ్చిన ముఖ్యమైన చిత్రాలు.

కళాకారుల కుటుంబానికి చెందిన ఈయన.. ప్రముఖ నటీమణులు ఊర్వశి, కలారంజిని మరియు దివంగత నటి కల్పనలకు స్వయానా సోదరుడు. నిన్న జనవరి 21వ తేదీ సాయంత్రం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స ఫలితమివ్వకపోవడంతో ఆయన మరణించారు.

ఆయన మృతి పట్ల మలయాళ, తమిళ సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటి ఊర్వశితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సినీ తారలు తరలివస్తున్నారు.


Posted

in

by

Tags: