జౌన్పూర్: ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీ సాధించాలనే పిచ్చితో ఒక యువకుడు తనను తాను వికలాంగుడిగా మార్చుకోవడమే కాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఒక భయంకరమైన కుట్ర పన్నాడు. అయితే నిజం ఎప్పుడూ దాగదు అన్నట్లుగా, జౌన్పూర్ పోలీసులు ఈ వింతైన మరియు దిగ్భ్రాంతికరమైన ప్లాన్ను బట్టబయలు చేశారు.
ఏం జరిగిందంటే? లైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలీల్పూర్ గ్రామానికి చెందిన సూరజ్ భాస్కర్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. రోడ్డు పక్కన నిర్మిస్తున్న తన ఇంటిలోకి అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారని, తనను దారుణంగా కొట్టి స్పృహ తప్పేలా చేశారని తెలిపాడు. ఆ తర్వాత తన కాలు పాదాన్ని నరికి తమతో పాటు తీసుకువెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వార్తతో స్థానికంగా కలకలం రేగింది.
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు: అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ గోల్డీ గుప్తా ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులకు సూరజ్ కథలో అనేక అనుమానాలు వచ్చాయి. సూరజ్ మొబైల్ ఫోన్ను తనిఖీ చేయగా ఒక యువతి నంబర్ దొరికింది. ఆమెను విచారించడంతో పోలీసుల అనుమానం బలపడింది.
తర్వాత పోలీసులకు సూరజ్ రాసిన ఒక డైరీ దొరికింది. అందులో “2026లో నేను ఖచ్చితంగా MBBS డాక్టర్ని అవుతాను” అని స్పష్టంగా రాసి ఉంది. విచారణలో తేలిందేమిటంటే, సూరజ్ అప్పటికే మెడికల్ సంబంధిత చదువు పూర్తి చేశాడు, కానీ MBBS సీటు సాధించడంలో రెండుసార్లు విఫలమయ్యాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన అతను, ‘దివ్యాంగుల కోటా’ (Physically Handicapped Quota) కింద సులభంగా MBBS సీటు పొందేందుకు తన కాలును తనే నరుక్కున్నాడు. ఆపై ఆ నేరాన్ని దుండగులపై నెట్టి పోలీసులను నమ్మించాలని చూశాడు.
