భారతీయులకు ప్రయాణాలంటే మక్కువ ఎక్కువ. అవకాశం దొరికితే చాలు బ్యాగ్ సర్దుకుని విహారయాత్రలకు బయలుదేరుతారు. భారతీయుల కలల డెస్టినేషన్లలో యూరప్ ఎప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. కానీ షెంజెన్ వీసా (Schengen Visa) కోసం పడే కష్టాలు, భారీ ఖర్చు, పర్యాటకుల రద్దీ వల్ల చాలామంది ఆ కలను వాయిదా వేసుకుంటారు.
యూరప్ లాంటి అనుభూతినిచ్చే ‘అల్బేనియా’ (Albania)
ఇప్పుడు భారతీయ పర్యాటకుల మధ్య ఒక దేశం వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. అది యూరప్ లాంటి అనుభూతిని ఇస్తూనే, తక్కువ ఖర్చుతో పర్యటనను ముగించేలా చేస్తుంది. అదే అల్బేనియా. సోషల్ మీడియాలో దీనిని “యూరప్ దాచిపెట్టిన అతిపెద్ద నిధి”గా అభివర్ణిస్తున్నారు.
ఇటీవల ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గగన తన 7 రోజుల అల్బేనియా యాత్ర వీడియోను షేర్ చేయగా, అది ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలోని అందమైన సముద్ర తీరాలు, కొండలపై ఉండే కేఫ్‌లు, రంగురంగుల వీధులు భారతీయులను కట్టిపడేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో యూరప్ చూడాలనుకునే వారికి ఇది వరంలా మారింది.
భారతీయుల మొదటి ఛాయిస్
జార్జియా, అజర్‌బైజాన్ తర్వాత ఇప్పుడు అల్బేనియా భారతీయ పర్యాటకుల హాట్ ఫేవరెట్‌గా మారుతోంది. గణాంకాల ప్రకారం.. 2025 మొదటి నాలుగు నెలల్లో భారత్ నుండి అల్బేనియా వెళ్లే వారి సంఖ్య 103 శాతం పెరిగింది. కేవలం భారత్ నుండే కాకుండా ఇటలీ, ఫిన్లాండ్, ఇజ్రాయెల్ దేశాల నుండి కూడా పర్యాటకులు రికార్డు స్థాయిలో ఇక్కడికి వస్తున్నారు.
వీసా చిక్కులు లేవు
అల్బేనియాలో పర్యాటకులు పెరగడానికి ప్రధాన కారణం అక్కడి సులభమైన వీసా విధానం. భారతీయులకు ఇక్కడికి వెళ్లడానికి షెంజెన్ వీసా అవసరం లేదు. ఈ-వీసా (E-Visa) సౌకర్యం ఉండటం వల్ల ఇంటర్వ్యూలు, రిజెక్షన్ల భయం ఉండదు. మొదటిసారి విదేశాలకు వెళ్లే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
బడ్జెట్ వివరాలు:
- వసతి: అల్బేనియాలో మంచి హోటళ్లు ₹2,000 నుండి ₹3,000 కే లభిస్తాయి.
- విమాన టికెట్లు: ఢిల్లీ నుండి అల్బేనియా రాజధాని ‘తిరానా’కు విమాన టికెట్ ధర సుమారు ₹21,000 నుండి ప్రారంభమవుతుంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకుంటే ఖర్చు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
- గమనిక: ఇక్కడ చాలా వరకు లావాదేవీలు నగదు (Cash) రూపంలోనే జరుగుతాయి. కరెన్సీ ఎక్స్ఛేంజీని ఎయిర్‌పోర్ట్ లేదా లోకల్ ఏటీఎంలలో చేసుకోవచ్చు.
చూడదగ్గ ప్రదేశాలు:
అల్బేనియాను ‘ల్యాండ్ ఆఫ్ ఈగిల్స్’ అని పిలుస్తారు.
- తిరానా: ఇక్కడి కేఫ్ కల్చర్ ప్రపంచ ప్రసిద్ధి.
- బెరాత్ మరియు గిరోకాస్టర్: ఇవి యునెస్కో (UNESCO) గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సిటీలు.
- బీచ్‌లు: అయోనియన్ మరియు అడ్రియాటిక్ సముద్ర తీరాలు చాలా ప్రశాంతంగా, తక్కువ రద్దీతో ఉంటాయి.
