టెహ్రాన్: ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని అనిపించినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్ళీ పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి.
ఫ్రాన్స్ తన ప్యాసింజర్ విమానాలను రద్దు చేసింది. మధ్యప్రాచ్యం వైపు అమెరికా నౌకాదళానికి చెందిన ఒక భారీ నౌకా సమూహాన్ని (దీనిని ట్రంప్ ‘ఆర్మాడా’ అని పిలిచారు) పంపుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. అది చిన్న దాడి అయినా, పరిమిత దాడి అయినా సరే, మేము దానిని పూర్తి స్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని హెచ్చరించింది. రిపోర్టుల ప్రకారం ఇజ్రాయెల్ తన గగనతలాన్ని ఖాళీ చేసింది. ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన USS Abraham Lincoln యుద్ధనౌక మరియు ఇతర సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోందని ఈ పరిస్థితులు సూచిస్తున్నాయి.
చిన్న దాడి జరిగినా యుద్ధమే: ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. అమెరికా సైనిక మోహరింపు ప్రత్యక్ష ముప్పు అని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ అని పేరు పెట్టి చిన్న దాడి చేసినా, తాము మాత్రం సర్వశక్తులతో ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు. అమెరికా ఒక బుల్లెట్ పేల్చినా అది యుద్ధానికే దారితీస్తుందని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ హెచ్చరిక ఏమిటి? అబ్రహం లింకన్ యుద్ధనౌకతో పాటు మూడు క్షిపణి నౌకలు, F-15 ఫైటర్ జెట్లను అమెరికా పంపిస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన సైన్యాన్ని హై అలర్ట్‌లో ఉంచింది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య చేపట్టినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
విమానాల రద్దు: ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ మరియు నెదర్లాండ్స్‌కు చెందిన KLM సంస్థలు ఇజ్రాయెల్, దుబాయ్, సౌదీ అరేబియాకు విమాన సర్వీసులను ఆదివారం వరకు రద్దు చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి.
