77వ గణతంత్ర దినోత్సవం (2026) జరుపుకుంటున్న ఈ వేళ, భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం.. దేశ ఏకీకరణ. 1947లో బ్రిటీష్ వారు వెళ్ళిపోయేటప్పుడు భారతదేశం 500కు పైగా సంస్థానాలుగా విడిపోయి ఉంది. వీటిని కలిపి ఒకే దేశంగా మార్చడం సామాన్యమైన విషయం కాదు. భారత్‌లో విలీనం కావడానికి నిరాకరించి, మొండికేసిన కొన్ని ముఖ్యమైన సంస్థానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం:
బ్రిటీష్ ఇండియా స్వతంత్రం పొందినప్పుడు, స్వదేశీ సంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్లో చేరేందుకు లేదా స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తన చాణక్య నీతితో మెజారిటీ సంస్థానాలను ఒప్పించారు. కానీ, కింది రాష్ట్రాలు మాత్రం మొదట ససేమిరా అన్నాయి:
1. ట్రావెన్కోర్ :
సముద్ర వ్యాపారం మరియు ఖనిజ సంపద కలిగిన ట్రావెన్కోర్ మొదట స్వతంత్ర దేశంగా ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటి దివాన్ సర్ సి.పి. రామస్వామి అయ్యర్ దీనికి మద్దతుగా నిలిచారు. జిన్నా మరియు బ్రిటీష్ వారి సహకారం కూడా వీరికి ఉందని చెబుతారు. అయితే, కేరళ సోషలిస్ట్ పార్టీ నాయకులు ఆయనపై చేసిన హత్యాప్రయత్నం తర్వాత, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఫలితంగా, జూలై 30, 1947న ట్రావెన్కోర్ భారత్‌లో చేరింది.
2. జోధ్‌పూర్:
జోధ్‌పూర్ మహారాజు హన్వంత్ సింగ్ భారత్ లేదా పాకిస్తాన్లలో ఎటు చేరాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు. జిన్నా కరాచీ ఓడరేవు సౌకర్యాలు కల్పిస్తామని ఆశ చూపడంతో పాకిస్తాన్ వైపు మొగ్గు చూపారు. కానీ సర్దార్ పటేల్ జోక్యం చేసుకుని, ఆయనకు తగిన రాయితీలు కల్పించడంతో మనసు మార్చుకున్న మహారాజు, ఆగస్టు 11, 1947న విలీన ఒప్పందంపై సంతకం చేశారు.
3. భోపాల్:
భోపాల్ నవాబ్ హమీదుల్లా ఖాన్ కూడా స్వతంత్రంగా ఉండాలని ఆశపడ్డారు. కాంగ్రెస్ పాలనకు ఆయన వ్యతిరేకంగా ఉండేవారు. కానీ ఇతర సంస్థానాలన్నీ భారత్‌లో విలీనం అవుతుండటం చూసి, చివరికి జూలై 1947లో ఆయన కూడా మన దేశంతో చేతులు కలిపారు.
4. హైదరాబాద్:
భారతదేశంలోనే అత్యంత సంపన్న సంస్థానం హైదరాబాద్. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్రంగా ఉండాలని పట్టుబట్టారు. ఇది భారత్ మధ్యలో ఒక ‘క్యాన్సర్ గడ్డ’ లాంటిదని సర్దార్ పటేల్ భావించారు. రజాకార్ల అరాచకాలు పెరగడంతో, సెప్టెంబర్ 13, 1948న ‘ఆపరేషన్ పోలో’ పేరుతో భారత సైన్యం హైదరాబాద్‌పై దాడి చేసింది. నాలుగు రోజుల పోరాటం తర్వాత సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోయారు.
5. జునాగఢ్:
జునాగఢ్ నవాబ్ మహబత్ ఖాన్జీ III తన సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపాలని భావించి ప్రకటించారు కూడా. కానీ అక్కడ ప్రజలు మెజారిటీ హిందువులు కావడంతో తిరుగుబాటు చేశారు. ఫిబ్రవరి 20, 1948న ప్రజాభిప్రాయ సేకరణ (Plebiscite) నిర్వహించగా, 91% మంది భారత్‌లో చేరాలని ఓటు వేశారు. దీంతో జునాగఢ్ భారత్‌లో భాగమైంది.
