ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్లో శనివారం సాయంత్రం రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్లో ఒక కాలేజీ ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
నార్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆలోక్ కుమార్ సింగ్ (33), శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో బోరివలి వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. మలాడ్ స్టేషన్లో ప్రయాణికులు దిగుతున్న సమయంలో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆ స్వల్ప వివాదం కాస్తా ముదిరింది. నిందితుడు ఒక్కసారిగా పదునైన వస్తువు తీసి ఆలోక్ కుమార్ కడుపులో పొడిచాడు. సాయంత్రం వేళ రద్దీగా ఉన్న ప్లాట్‌ఫారమ్ నంబర్ 1పై ఈ దారుణం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన ఆలోక్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
నిందితుడి గుర్తింపు మరియు అరెస్ట్:
మలాడ్ స్టేషన్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, తెల్లటి షర్టు, నీలిరంగు జీన్స్ ధరించిన ఒక వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై వేగంగా పారిపోవడం కనిపించింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పోలీసులు నిందితుడిని ఓంకార్ ఏకనాథ్ షిండే (27) గా గుర్తించారు. ముంబై వెస్ట్రన్ సబర్బ్స్లోని కురార్ ప్రాంతంలో తలదాచుకున్న అతడిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు మెటల్ పాలిషర్‌గా పనిచేసే దినసరి కూలీ అని తెలిసింది.
దిగ్భ్రాంతిలో కాలేజీ వర్గాలు:
మృతుడు ఆలోక్ కుమార్ సింగ్ తన భార్యతో కలిసి మలాడ్ ఈస్ట్‌లో నివసించేవారు. 2024 నుండి జూనియర్ కాలేజీ విభాగంలో మ్యాథమెటిక్స్ మరియు స్టాటిస్టిక్స్ బోధిస్తున్నారు. ఆయన ఎంతో శాంతస్వభావి అని, విద్యార్థుల పట్ల ఎంతో అంకితభావంతో ఉండేవారని సహచర అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.
