దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా భావించే UPSC సివిల్ సర్వీసెస్ సాధించాలంటే వయసుతో పాటు అపారమైన అనుభవం కూడా కావాలని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనా ధోరణి మారుతోంది.
2022 సివిల్ సర్వీసెస్ ఫలితాల తర్వాత ఐపీఎస్ (IPS) అధికారుల జాబితాను గమనిస్తే ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. దాదాపు 100 మందికి పైగా ‘జెనరేషన్ జెడ్’ (Generation Z) యువకులు భారత పోలీసు సేవలో చేరారు. వీరిలో ముగ్గురు యువకులు కేవలం 21 ఏళ్ల వయసులోనే, తమ మొదటి ప్రయత్నంలోనే UPSC సాధించడం విశేషం. డిజిటల్ యుగంలో పెరిగిన ఈ యువ అధికారులు ఇప్పుడు దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల బాధ్యతలను చేపట్టబోతున్నారు.
Gen Z అంటే ఎవరు? 1997 నుండి 2012 మధ్య జన్మించిన వారిని ‘జెనరేషన్ జెడ్’ లేదా Gen Z అని పిలుస్తారు.
ఆ టాప్ ముగ్గురు Gen Z ఐపీఎస్ అధికారులు:
ఈ ముగ్గురు అధికారుల పుట్టిన సంవత్సరం 2001. అంటే పరీక్ష రాసే సమయానికి వీరి వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే.
1. ఐపీఎస్ దేవ్ వ్రత్ జోషి (IPS Dev Vrat Joshi): ఉత్తరాఖండ్‌కు చెందిన దేవ్ వ్రత్ 2022 పరీక్షలో 125వ ర్యాంక్ సాధించారు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈయన, జాగ్రఫీని ఆప్షనల్‌గా తీసుకున్నారు. టెక్నాలజీపై అవగాహనతో పాటు గిటార్ వాయించడం, ఫుట్‌బాల్ ఆడటం ఈయనకు ఇష్టం.
2. ఐపీఎస్ కుమార్ సుశాంత్ (IPS Kumar Sushant): బీహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందిన సుశాంత్ 122వ ర్యాంక్ సాధించి తన జిల్లా పేరు నిలబెట్టారు. ఢిల్లీలోని రాంలాల్ ఆనంద్ కాలేజీ నుండి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందిన ఈయన, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్తో UPSC విజేతగా నిలిచారు.
3. ఐపీఎస్ జి జి ఏఎస్ (IPS Gee Gee AS): చెన్నైకి చెందిన ఈమె అసాధారణ ప్రతిభ కనబరిచారు. 2022లో తన మొదటి ప్రయత్నంలోనే 107వ ర్యాంక్ సాధించి తమిళనాడు స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమార్తె అయిన ఈమె, కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత 2024లో మళ్ళీ పరీక్ష రాసి 25వ ర్యాంక్ సాధించి IFS (ఫారిన్ సర్వీస్)కు ఎంపికయ్యారు.
‘బేబీ ఫేస్’ ఐపీఎస్ అభిజీత్ పాటిల్ ఏమంటున్నారు?
రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్‌లో ASPగా పనిచేస్తున్న అభిజీత్ పాటిల్ (IPS Abhijeet Patil) కూడా ఈ బ్యాచ్‌కు చెందినవారే. తన ముఖం చూడటానికి చాలా చిన్న పిల్లాడిలా ఉండటంతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన మాట్లాడుతూ.. “Gen Z యువతకు స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. స్కూల్, కాలేజీ రోజుల్లోనే ఏం కావాలో నిర్ణయించుకుంటున్నారు. నేను నా బీటెక్ రిజల్ట్స్ రాకముందే UPSC ప్రిలిమ్స్ పాస్ అయ్యాను” అని తెలిపారు.
