నేటి కాలంలో ఫోన్ కేవలం ఒక గ్యాడ్జెట్ మాత్రమే కాదు, అది మన దైనందిన జీవితంలో ఒక ప్రాథమిక అవసరంగా మారింది. కాల్స్, ఇంటర్నెట్, యూపీఐ పేమెంట్స్ మరియు వినోదం.. ఇలా అన్నీ బ్యాటరీపైనే ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది నేరుగా మీరు దానిని ఎలా వాడుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ఛార్జింగ్ విషయంలో పాత తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు, దీనివల్ల బ్యాటరీ క్రమంగా బలహీనపడుతుంది.
ఫోన్ 100% ఛార్జ్ చేయడం సరైనదేనా? ప్రస్తుత స్మార్ట్ఫోన్లలో ‘లిథియం అయాన్’ బ్యాటరీలను వాడుతున్నారు. ఇవి ఓవర్ఛార్జింగ్ నుండి తమను తాము రక్షించుకోగలవు. కానీ, బ్యాటరీ శాతం 80% దాటి 100% కి చేరుకునే క్రమంలో బ్యాటరీపై ఒత్తిడి (Stress) పెరుగుతుంది. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కొన్ని నెలల్లోనే బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ఆప్టిమైజ్డ్’ లేదా ‘అడాప్టివ్ ఛార్జింగ్’ ఫీచర్లు ఉన్నప్పటికీ, రాత్రంతా 100% ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదు.
ఫోన్ను ఎన్ని శాతానికి ఛార్జ్ చేయాలి? బ్యాటరీ నిపుణులు మరియు టెక్ కంపెనీల పరిశోధన ప్రకారం, ఫోన్ బ్యాటరీని 20% నుండి 80% మధ్య ఉంచడం అత్యంత ఉత్తమం. ఈ రేంజ్లో బ్యాటరీపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది మరియు ‘ఛార్జ్ సైకిల్’ (Charge Cycle) ఎక్కువ కాలం మన్మడమే కాకుండా బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. మీ ఫోన్ 4 నుండి 5 ఏళ్ల పాటు సాఫీగా పనిచేయాలంటే, బ్యాటరీ 80-85 శాతానికి రాగానే ఛార్జింగ్ తీసివేయడం అలవాటు చేసుకోండి. అలాగే బ్యాటరీ 10% కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోండి.
