భారతదేశంలోని అత్యంత విషపూరితమైన నాలుగు ప్రధాన పాములలో (Big Four) ‘కట్లపాము ‘ ఒకటి. ఇది ఎక్కువగా రాత్రి సమయాల్లోనే కరుస్తుందని, మరణాలు కూడా రాత్రే సంభవిస్తాయని చెబుతుంటారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇక్కడ చూద్దాం.
రాత్రిపూట ఎందుకు ప్రమాదకరం? కట్లపాము పాముకు రాత్రి వేళల్లో వేటాడే అలవాటు ఉంది. పగటిపూట పాత భవనాల సందుల్లో లేదా బొరియల్లో దాక్కుంటుంది. రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటకు వచ్చినప్పుడు, తెలియక ఇళ్లలోకి చొరబడే అవకాశం ఉంది. దీని శరీరం నలుపు రంగులో ఉండి, దానిపై తెల్లటి జంట చారలు ఉంటాయి. ఈ చారలు కట్టు కట్టినట్లు ఉండటం వల్ల దీనికి ‘కట్లపాము అని పేరు వచ్చింది.
సైలెంట్ కిల్లర్: మిగతా విషపూరిత పాములలాగా ఇది బుస కొట్టడం లేదా హెచ్చరించడం వంటివి చేయదు. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. తనను ఎవరైనా తొక్కినా లేదా ఇబ్బంది పెట్టినా మాత్రమే ఆత్మరక్షణ కోసం కరుస్తుంది. రాత్రి నేలపై పడుకునే వారు ఈ పాము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కట్లపాము కాటు లక్షణాలు: కట్లపాము కాటు మిగతా పాముల కంటే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా పాము కరిస్తే విపరీతమైన నొప్పి, వాపు ఉంటాయి. కానీ కట్లపాము కరిస్తే ఆ ప్రదేశంలో నొప్పి గానీ, వాపు గానీ ఉండవు. దీని విషం నేరుగా నాడీ వ్యవస్థపై (Neurotoxic) ప్రభావం చూపుతుంది.
- కనురెప్పలు భారమవ్వడం, తెరవలేకపోవడం.
- వాంతులు, మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
- చిగుళ్ల నుండి లేదా మూత్రంలో రక్తం పడటం.
- నోటి నుండి చొంగ కారడం, మాట పడిపోవడం.
మరణాలకు కారణం: నిద్రలో ఉన్నప్పుడు కట్లపాము కరిస్తే, నొప్పి తెలియకపోవడం వల్ల తాము కరిపించుకున్నామనే విషయం బాధితులకు తెలియదు. దీనివల్ల చికిత్స ఆలస్యమై శ్వాసకోశ వ్యవస్థ విఫలమై నిద్రలోనే ప్రాణాలు కోల్పోతారు. అందుకే రాత్రిపూట పాము కటువనే అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ వీనమ్ (Anti-venom) తీసుకోవాలి.
