చలిగా ఉండే కొండ ప్రాంతాల్లో వేడివేడి మ్యాగీ తినడం పర్యాటకులకు ఒక మధురమైన అనుభవం. అందుకే ఇప్పుడు కొండల్లో ఎక్కడ చూసినా మ్యాగీ విక్రయించే చిన్న చిన్న హోటళ్లు కనిపిస్తున్నాయి. అయితే, ఈ మ్యాగీ అమ్మడం ద్వారా ఎంత సంపాదించవచ్చో ఎప్పుడైనా ఆలోచించారా? బాదల్ ఠాకూర్ అనే కంటెంట్ క్రియేటర్ చేసిన ఒక ప్రయోగం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సంపాదన వివరాలు: బాదల్ ఠాకూర్ ఒక పర్యాటక ప్రాంతంలో ఒక చిన్న టేబుల్, గ్యాస్ సిలిండర్‌తో మ్యాగీ స్టాల్ ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక ప్లేట్ మ్యాగీ ధరను ₹70 గా, చీజ్ మ్యాగీ ధరను ₹100 గా నిర్ణయించాడు. (నిజానికి మార్కెట్లో ఒక మ్యాగీ ప్యాకెట్ ధర కేవలం ₹15 మాత్రమే).
కేవలం 4 నుండి 5 గంటల్లోనే అతను 200 ప్లేట్లు అమ్మేశాడు. రోజంతా కలిపి సుమారు 300 నుండి 350 ప్లేట్లు అమ్ముడయ్యాయి. ఒక ప్లేట్ సగటు ధర ₹70 అని లెక్కవేసుకున్నా, రోజుకు సుమారు ₹21,000 ఆదాయం వచ్చినట్లు అతను తెలిపాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ సంపాదన చూసి నోరెళ్లబెడుతున్నారు. “నెలలో 30 రోజులు ఇలాగే అమ్మితే ₹6 లక్షల పైనే సంపాదించవచ్చు, నేనిక నా ఉద్యోగం మానేసి మ్యాగీ అమ్ముకుంటా” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే 3.5 మిలియన్ల వ్యూస్ సాధించి వైరల్ అయ్యింది.
