వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంతో పాటు మెదడులో కూడా మార్పులు రావడం సహజం. అయితే జ్ఞాపకశక్తి తగ్గడం లేదా ఆలోచనా శక్తి మందగించడం అనేది విధి అని సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిప్లబ్ దాస్ తన మెదడు చురుకుదనం కోసం ప్రతిరోజూ పాటిస్తున్న ఆరు సూత్రాలు ఇవే:
1. నిరంతర శారీరక శ్రమ: వ్యాయామం అంటే కేవలం కండరాలు పెంచుకోవడమే కాదు, అది మెదడుకు రక్షణ కవచం. వ్యాయామం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి కొత్త నాడీ కణాలు (Neurons) ఏర్పడతాయి. సోమరితనం వదిలి ప్రతిరోజూ కనీసం నడక లేదా యోగా చేయడం వల్ల మనస్సు ఉల్లాసంగా ఉంటుంది.
2. నిద్రలో రాజీ పడకూడదు: నిద్ర అనేది బద్ధకం కాదు, అది మెదడుకు జరిగే రిపేర్ వర్క్. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు తనలోని వ్యర్థాలను శుభ్రం చేసుకుంటుంది మరియు జ్ఞాపకాలను భద్రపరుస్తుంది. నిద్ర తగ్గితే ఏకాగ్రత దెబ్బతింటుంది, చిరాకు పెరుగుతుంది.
3. కొత్త విషయాలను నేర్చుకోవడం: వయసు పెరిగితే నేర్చుకునే సామర్థ్యం తగ్గుతుందనేది అపోహ మాత్రమే. కొత్త భాషలు నేర్చుకోవడం, కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవడం లేదా కష్టమైన పనులను ప్రయత్నించడం వల్ల మెదడులో కొత్త మార్గాల (Neural pathways) నిర్మాణం జరుగుతుంది. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది.
4. మెదడుకు మేలు చేసే ఆహారం: పండ్లు, ఆకుకూరలు, నట్స్ (వాల్నట్స్, బాదం), చేపలు మరియు తగినంత నీరు తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి ముఖ్యం. ప్రాసెస్ చేసిన ఆహారం ఆలోచనా శక్తిని తగ్గిస్తుంది. అయితే, ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం కూడా మానసిక ఆరోగ్యానికి అవసరమే.
5. మానసిక ప్రశాంతత: దీర్ఘకాలిక ఒత్తిడి మెదడును త్వరగా ముసలిది చేస్తుంది. అనవసరమైన వార్తలు, సోషల్ మీడియా రొదకు దూరంగా ఉంటూ.. ప్రశాంతంగా ఒంటరిగా గడపడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి.
6. సామాజిక సంబంధాలు: ఒంటరితనం మెదడుకు శాపం. మంచి స్నేహితులతో మాట్లాడటం, నవ్వడం, చర్చలు చేయడం వల్ల మెదడుకు పూర్తిస్థాయి వ్యాయామం లభిస్తుంది. మనల్ని ప్రోత్సహించే నలుగురు వ్యక్తులతో కలుసుండటం మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
