నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే (Economic Survey) ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ఉద్రిక్తతలు ఉన్నంత కాలం బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం లేదని స్పష్టమైంది. అంటే, మీరు బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ జేబుకు మరింత చిల్లు పడక తప్పదు.
రికార్డు స్థాయికి చేరుతున్న ధరలు: 2025 సంవత్సరం బంగారం, వెండికి అద్భుతంగా సాగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల (Geo-political tensions) నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి కోసం ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గు చూపారు. 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర ₹2 లక్షలు, కిలో వెండి ధర ₹4 లక్షల మార్కును దాటుతుందని ఎవరూ ఊహించలేదు.
ధరలు పెరగడానికి కారణమేంటి? ప్రపంచవ్యాప్త అనిశ్చితి, టారిఫ్ యుద్ధాలు మరియు అమెరికన్ డాలర్ బలహీనపడటం బంగారం ధరలకు ఊతమిచ్చాయని ఆర్థిక సర్వే పేర్కొంది. యుద్ధ భయాల వల్ల పెట్టుబడిదారులు తమ డబ్బు సురక్షితంగా ఉండే చోట పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు.
పెరిగిన దిగుమతులు: ధరలు ఆకాశాన్నంటుతున్నా భారత్లో డిమాండ్ తగ్గకపోవడం విశేషం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 27.4% పెరిగాయి. దీని ప్రభావం భారత విదేశీ మారక నిల్వలపై కూడా కనిపించింది. బంగారు నిల్వల విలువ మార్చి 2025లో 78.2 బిలియన్ డాలర్ల నుండి జనవరి 2026 నాటికి 117.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
