రాజ్‌కోట్‌లో ఒక వింత ప్రమాదం కారణంగా పరువు పోయిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గొండల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. యువకుడు మరణించిన తర్వాత, అతని బావ ఎవరికీ చెప్పకుండా మృతదేహాన్ని ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టడం ఈ కేసులో మరో సంచలన విషయం.
అనారోగ్యంతో ఉన్న తన భార్య (మృతుడి సోదరి), తమ్ముడి మరణవార్తను తట్టుకోలేదని భావించి అతను ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ ప్రారంభించారు.
అసలేం జరిగింది? జనవరి 12, 2026న గొండల్కు చెందిన 18 ఏళ్ల యువకుడి జననాంగం ఒక పచ్చి కొబ్బరికాయలో ఇరుక్కుపోయింది. ఈ వింత ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో అతడిని రాజ్‌కోట్, ఆపై అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. 10 రోజుల చికిత్స తర్వాత జనవరి 22న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు.
కానీ, ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, అవమానాలను తట్టుకోలేక అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ బాధతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బావ తీసుకున్న షాకింగ్ నిర్ణయం: యువకుడు మరణించినా అతని బావ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఇంటి వెనుక గోతి తీసి శవాన్ని పాతిపెట్టాడు. అయితే, సోదరి పదే పదే తమ్ముడి గురించి అడగడంతో, భయపడిన బావ తన స్నేహితుడికి నిజం చెప్పాడు. స్నేహితుడి సలహాతో పోలీసులకు లొంగిపోయి అసలు విషయం వెల్లడించాడు. మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు, పోస్ట్‌మార్టం నిమిత్తం రాజ్‌కోట్‌కు తరలించారు.
