ఉద్యోగ వేటలో ఉన్న యువతకు భారీ శాలరీ ప్యాకేజీ అనేది ఒక కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. ఆఫర్ లెటర్‌పై కనిపించే లక్షల రూపాయల అంకెలు కళ్లకు హాయినిస్తాయి, కానీ ఆ మొత్తం నిజంగానే బ్యాంక్ ఖాతాలోకి వస్తుందా?
ఇటీవల ‘బ్లాక్ సే బ్లాక్’ (BlockseBlock) స్టార్టప్ వ్యవస్థాపకుడు సాహిల్ ఠాకూర్ లింక్డ్ఇన్లో ఈ చేదు నిజం గురించి పోస్ట్ చేశారు. కంపెనీలు భారీగా ‘కాస్ట్ టు కంపెనీ’ (CTC) చూపిస్తూ అభ్యర్థులను ఎలా ఆకర్షిస్తాయో, వాస్తవానికి చేతికి వచ్చే జీతం ఎంత తక్కువగా ఉంటుందో ఆయన వివరించారు.
₹18 లక్షల ఆఫర్ వెనుక షాకింగ్ నిజం: సాహిల్ ఠాకూర్ తన విద్యార్థికి ఒక స్టార్టప్ నుండి వచ్చిన ₹18 లక్షల (LPA) ఆఫర్ లెటర్‌ను విశ్లేషించారు. లోతుగా పరిశీలిస్తే, ఆ ఉద్యోగి ఫిక్స్డ్ బేస్ శాలరీ కేవలం ₹6 లక్షలు మాత్రమేనని తేలింది. అంటే నెలకు బ్యాంక్ ఖాతాలో పడేది కేవలం ₹50,000 మాత్రమే. మిగిలిన ₹12 లక్షలు అనేవి కేవలం కొన్ని షరతులతో కూడినవి:
- పెర్ఫార్మెన్స్ బోనస్ (₹4 లక్షలు): ఉద్యోగి తన టార్గెట్‌ను 120% పూర్తి చేస్తేనే ఈ బోనస్ వస్తుంది. మేనేజర్లు నిర్ణయించే ఈ కఠినమైన టార్గెట్లను కేవలం 10% మంది మాత్రమే పూర్తి చేయగలరు.
- రిటెన్షన్ బోనస్ (₹3 లక్షలు): కంపెనీలో రెండు ఏళ్లు పూర్తి చేసుకుంటేనే ఈ డబ్బు ఇస్తారు. కానీ స్టార్టప్‌లలో చాలామంది 18 నెలల లోపే ఉద్యోగం మారుతుంటారు, కాబట్టి ఇది కంపెనీ దగ్గరే ఉండిపోతుంది.
- ESOPs – షేర్లు (₹5 లక్షలు): ఇవి కంపెనీ స్టాక్ ఆప్షన్లు. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితేనే లేదా ఎవరైనా కొనుగోలు చేస్తేనే వీటితో ఉపయోగం ఉంటుంది. లేదంటే వీటి విలువ సున్నా. ఇవి కూడా నాలుగు ఏళ్లలో విడతల వారీగా లభిస్తాయి.
సాహిల్ ఠాకూర్ తన విద్యార్థికి ఇలా సలహా ఇచ్చారు: “నువ్వు ₹18 లక్షలు సంపాదించడం లేదు, కేవలం ₹6 లక్షలు మరియు ఒక ‘లాటరీ టికెట్’ పొందుతున్నావు.”
