చాలా మంది మెట్లు ఎక్కడానికి కూడా కష్టపడే వయసులో, ఈ 89 ఏళ్ల వృద్ధురాలు ప్రతిరోజూ మధ్యాహ్నం రద్దీగా ఉండే ముంబై లోకల్ ట్రైన్ ఎక్కుతారు. ఆమె ఎవరినీ సాయం కోరడానికి కాదు, తన కష్టంతో బ్రతకడానికి ఆ పని చేస్తున్నారు. ఆమె పట్టుదల చూసి చలించిపోయిన ఒక ప్రయాణికురాలు తనతో మాట్లాడి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
గుండెల్ని పిండేసే నిజం: వీడియోలో ఆ బామ్మ పూసల బ్రాస్లెట్లు అమ్ముతూ కనిపిస్తారు. ఆ ప్రయాణికురాలు బామ్మను పేరు అడగగా “కమలాబెన్ మెహతా” అని, వయసు “89 ఏళ్లు” అని ఆమె ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. తాను నలసోపారాలో ఉంటానని, తన కుటుంబంతో కలిసి ఉండాలంటే వారికి డబ్బులు ఇవ్వాలని ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి, బాధకు గురిచేశాయి. తన కుటుంబానికి అవమానం జరగకూడదనే ఉద్దేశంతో ఆమె తన ఇంటి అడ్రస్ చెప్పడానికి నిరాకరించారు.
ఆరు దశాబ్దాల పోరాటం: ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణించే వారికి ఈమె కొత్తేమీ కాదు. గత 60 ఏళ్లుగా ఆమె విలే పార్లే మరియు నలసోపారా మధ్య ప్రయాణిస్తూ చేతితో చేసిన వస్తువులను అమ్ముతున్నారు. ఆమె కథ మరింత విషాదకరం ఏమిటంటే, పెళ్లయిన కేవలం నెల రోజులకే పూజారి అయిన తన భర్తను కోల్పోయారు. అప్పటి నుండి ఆమె విశ్రాంతి తీసుకోకుండా తన కాళ్ల మీద తాను నిలబడటానికి కష్టపడుతూనే ఉన్నారు.
