న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఆమె వయసు కేవలం 13 ఏళ్లు. చదువుకోవాలనే పట్టుదలతో హాస్టల్లో చేరి 8వ తరగతి చదువుతోంది. తమ కూతురు ప్రభుత్వ హాస్టల్లో సురక్షితంగా ఉందని తల్లిదండ్రులు కూడా నిశ్చింతగా ఉన్నారు.
కానీ, ఆమె గర్భవతి అనే విషయం తెలిసి వారి గుండె పగిలిపోయింది. ఇంత చిన్న వయసులో బిడ్డను కనడం సాధ్యం కాదని అబార్షన్ చేయిద్దామనుకునే లోపే సమయం మించిపోయింది. మరో 3-4 నెలల్లో డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంతవరకూ తాను గర్భవతిని అన్న విషయం ఆ చిన్నారికి కూడా తెలియదు.
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్లోని ఒక ప్రభుత్వ హాస్టల్లో ఈ దారుణం జరిగింది. నెలల తరబడి బాలికపై అకృత్యాలకు పాల్పడిన కామాంధులు, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక గర్భవతి కావడంతో ఈ ఘోరం బయటపడింది. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
హాస్టల్లో ఏం జరిగింది? ఖురైలోని గిరిజన ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న ఈ బాలికపై సుమారు 4 నెలల పాటు లైంగిక దాడి జరిగింది. నిందితుడు ఆమెను చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఇటీవల బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా ఆమె 5 నెలల గర్భవతి అని తేలింది. బాధితురాలిని భోపాల్‌లోని హమీదియా ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు ఎవరు? బాలిక గత రెండేళ్లుగా ఆ హాస్టల్లో ఉంటోంది. హాస్టల్‌కు కూరగాయలు సరఫరా చేసేందుకు అల్తాఫ్ అనే యువకుడు వచ్చేవాడు. సెప్టెంబర్ 2025లో అతను బలవంతంగా బాలిక గదిలోకి దూరి తలుపులు వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని భయపెట్టాడు. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో వార్డెన్‌కు సమాచారం ఇచ్చింది. వార్డెన్ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా, వారు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది.
అధికారుల చర్యలు: ఈ ఘటన వెలుగులోకి రాగానే గిరిజన సంక్షేమ శాఖ సహాయ కమిషనర్ స్పందించారు. కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్ చైన్ బాటి సయామ్ను తక్షణమే సస్పెండ్ చేశారు. బాలిక శరీరంలో మార్పులను ఎందుకు గమనించలేదని ఆమెను ప్రశ్నించారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు గ్రామానికి చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
